క్లాస్, న్యూస్రూంలు ఒక్కటైతేనే..
మల్లాది వేంకట గోపాలకృష్ణ:
జర్నలిజం ఉద్యోగం(Journalism job) కాదు. అదొక బాధ్యత. ప్రజల తరఫున కలమై, గళమై ప్రతిధ్వనించే అక్షరాలా ఆయుధం. జర్నలిజం(Journalism) అంటే ఒకప్పుడు ప్రతికలకే(Newspapers) పరిమితమైంది. నాడు అక్షర పొత్తిళ్లలోని జర్న లిజం అరచేతిలోనే వార్తలు తిలకించే, ఆలకించే స్థాయికి చేరింది. కానీ, జర్నలిస్టులను తయారు చేసే విద్య మాత్రం ఇంకా రూ పాంతరం చెందడం లేదు. అవసరమో, అవకాశమో వివిధ రకాల మీడియా ప్లాట్‌ఫాంలపై జర్నలిస్టులు పుటుకొస్తున్నారు.
అయితే, తరగతి గదుల్లో జర్నలిజం కోర్సులకు(Journalism courses), బాహ్యప్రపంచంలో పరిస్థితులకు నింగికి, నేలకు ఉన్నంత దూర వ్యత్యాసం ఉం టుంది. ఇతర ఉన్నత విద్యల మాదిరిగానే జర్నలిజం విద్యలో ప్రాక్టికల్స్, ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్ షిప్ లాంటివి అమలు చేసి.. జర్నలిజం ‘పాళి’ ఇంకు పాలిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు కొన్ని ఆచరణాత్మక అంశాలపై గత సంచికలో చర్చించడం జరిగినది. మిగ తా కొన్ని అంశాలను ఈ సంచికలో పరిశీలిద్దాం..
మూడో చికిత్స: హౌస్ సర్జన్సీ
వైద్య విద్యార్థి ఏడాది హౌస్ సర్జన్సీ పూర్తి చేయకుండా డాక్టర్ కాలేడు. న్యాయవిద్యార్థి కోర్టుల్లో సీనియర్ దగ్గర శిక్షణ పొందుతాడు. మరి ప్రజాస్వామ్యానికి కా వలాగా ఉండాల్సిన జర్నలిస్టుకు ఆ నిబంధన ఎందుకు ఉండకూడదు? జర్నలిజం డిగ్రీలో చివరి ఆరు నెలలు లేదా ఏడాది తప్పనిసరిగా గుర్తింపు పొందిన మీడియా సంస్థలో స్టైపెండ్‌తో కూడిన రెసిడెన్సీగా ఉం డాలి. జాతీయ విద్యావిధానం-2020 కూ డా ఇంటర్న్‌షిప్‌లను, ఆచరణాత్మక అధ్యయనాన్ని పదేపదే ప్రస్తావిస్తోంది. కానీ ఇవాళ చాలా చోట్ల ఇంటర్న్‌షిప్ అంటే ఎక్కడో ఒకచోట సంతకం తెచ్చుకోవడం మాత్రమే. అది పేరుకే ఇంటర్న్‌షిప్ కాకుండా, ఒక సీనియర్ మార్గదర్శి పర్యవేక్షణలో, నిర్దిష్ట లక్ష్యాలతో, మూల్యాంకనంతో కూడిన నిజమైన పనిగా ఉండాలి.
దీనికి తోడు ప్రతి విభాగం విద్యార్థులు నడిపే ఒక వార్తా వేదికను (పత్రిక గానీ, డిజిటల్ పోర్టల్ గానీ, కమ్యూనిటీ రేడియో గానీ) క్రమం తప్పకుండా నిర్వహించాలి. క్యాంపస్‌ను, చుట్టుపక్కల బస్తీలను, గ్రామాలను విద్యార్థులే కవర్ చేసే వ్యవస్థ ఉంటే వారికి డిగ్రీ చేతికి అందే సమయానికే అనుభవం కూడా చేతికి వస్తుంది. విద్యార్థి మూల్యాంకనం పరీక్ష పత్రాలతో మాత్రమే కాకుండా, అతను రాసిన, ప్రచురించిన కథనాల పోర్ట్‌ఫోలియోతో జరగాలి. ఉద్యోగానికి వెళ్లేటప్పుడు మార్కుల జాబితా కంటే ప్రచురితమైన కథనాల సంకలనం ఎక్కువ మాట్లాడుతుంది.
ఈ ఆలోచన ఊహాజనితం కాదు: ప్రపంచంలో విజయవంతంగా అమలవుతోంది. అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన వాల్టర్ క్రాంకైట్ జర్నలిజం పాఠశాల తన విద్యా విధానాన్ని బహిరంగంగానే టీచింగ్ హాస్పిటల్ న మూనాగా పిలుచుకుంటుంది. వైద్య విద్యార్థులు బోధనాసుపత్రుల్లో రోగులకు సేవ చేస్తూ నేర్చుకున్నట్టే, అక్కడి జర్నలిజం విద్యార్థులు సీనియర్ ప్రొఫెషనల్ జర్నలిస్టుల పర్యవేక్షణలో నిజమైన వార్తా సం స్థలో పనిచేస్తారు.
ఆ విశ్వవిద్యాలయం ఏ కంగా రాష్ట్ర ప్రజా టెలివిజన్ చానల్ అరిజోనా పీబీఎస్ను తన జర్నలిజం పాఠశా లలో భాగం చేసుకుంది. ఫలితంగా విద్యార్థులు రూపొందించే క్రాంకైట్ న్యూస్ ఆ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద వార్తా సంస్థగా ఎదిగింది. పలు జాతీయ ఫౌండేషన్లు విశ్వవిద్యాలయాలన్నీ ఈ నమూనాను అనుస రించాలని పిలుపునిచ్చాయి. మన దగ్గర కూడా విశ్వవిద్యాలయాలకు కమ్యూనిటీ రేడియో అనుమతులు ఉన్నాయి, ప్రభుత్వ ప్రసార సంస్థలు ఉన్నాయి. సంకల్పం ఉం టే మన విశ్వవిద్యాలయాలూ బోధనా వార్తాకేంద్రాలుగా మారవచ్చు.
యూరప్‌లో డెన్మార్క్ మరో అడుగు ముందుంది. అక్కడి డానిష్ స్కూల్ ఆఫ్ మీడియా అండ్ జర్నలిజంలో మూడో సెమిస్టర్ విద్యార్థులు దేశంలోని మీడియా సంస్థలను పర్యటించి, నచ్చిన చోట ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేస్తారు. మీడియా సంస్థలే వారిని ఏడాదిన్నర కాలానికి నియమించుకుంటాయి. అంటే చదువులో అం తర్భాగంగానే ఏడాదిన్నర నిజమైన ఉద్యోగానుభవం. దానితో పోలిస్తే మనం ప్రతి పాదిస్తున్న ఆరు నెలల నుంచి ఏడాది రెసిడెన్సీ చాలా నిరాడంబరమైన కోరికే.
నాలుగో చికిత్స: ప్రమాణాల కావలి
వైద్య విద్యను జాతీయ వైద్య కమిషన్, న్యాయ విద్యను బార్ కౌన్సిల్, సాంకేతిక విద్యను ఏఐసీటీఈ పర్యవేక్షిస్తాయి. కనీస సదుపాయాలు, అధ్యాపకుల అర్హతలు, ఆచరణాత్మక శిక్షణ ఉంటేనే ఆ కోర్సులకు అనుమతి దక్కుతుంది. కానీ జర్నలిజం విద్యకు అలాంటి వృత్తిపరమైన కావలి లేదు. అమెరికాలో ఈ పనిని అక్రెడిటింగ్ కౌన్సిల్ ఆన్ ఎడ్యుకేషన్ ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ (ఏసీఈజేఎంసీ) అనే స్వతంత్ర మండలి చేస్తుంది. అది ప్రతి ఆరేళ్లకోసారి జర్నలిజం పాఠశాలలను సమీక్షిస్తుంది.
అధ్యాపకుల్లో విద్యా ర్హతలు, వృత్తి అనుభవం రెండింటి మధ్య సమతుల్యత ఉందా, ఆచరణాత్మక కోర్సు ల్లో ప్రతి అధ్యాపకుడికి ఇరవై మంది విద్యార్థులకు మించకుండా ఉన్నారా వం టి కఠిన ప్రమాణాలను పరిశీలిస్తుంది. ఈ ప్రమాణాలు ఎంత కఠినమంటే, వందలాది జర్నలిజం కోర్సులు ఉన్న అమెరికా లో కేవలం 119 కార్యక్రమాలకే ఆ గుర్తింపు ఉంది. అందుకే ఒక గది, ఒక కంప్యూటర్, ఒక అతిథి అధ్యాపకుడు ఉంటే చాలు మాస్ కమ్యూనికేషన్ కోర్సు మొదలైపోతోంది. నాణ్యత లేని చదువుకు ఫీజులు కట్టిన విద్యార్థి చివరకు నిరుద్యోగిగా మిగులుతున్నాడు. ఆటువంటి క్లిష్టతరమైన పరి స్థితిని అక్కడ ఉన్న ప్రమాణాలు నిశితంగా పరిశీలిస్తూ చక్కదిద్దుతున్నాయి.
మనంకూడా వాస్తవ దృక్ఫథంతో ఆలోచించి పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండానే, ప్రభుత్వ జోక్యం లేకుండానే ఈ లోటును భర్తీ చేయవచ్చు. సీనియర్ ఎడిటర్లు, అధ్యాపకులు, మీడియా సంస్థల ప్రతినిధులతో ఒక స్వతంత్ర ప్రమాణాల మండలి ఏర్పడి, జర్నలిజం కోర్సులకు గుర్తింపు ఇచ్చే వ్యవస్థ తేవాలి. ల్యాబ్‌లు, అధ్యాపకులు, ఇంటర్న్‌షిప్ ఒప్పందాలు, ఉద్యోగాల్లో చేరిన పూర్వ విద్యార్థుల సం ఖ్య వంటి అంశాలను ప్రతి ఒక్క సంస్థ బహిరంగంగా ప్రకటించాలి. అప్పుడే విద్యార్థి ఏ కోర్సులో చేరాలో తెలివిగా నిర్ణయించుకోగలడు. పారదర్శకతకు భయప డే సంస్థలే సాధారణంగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తాయి. అదే దాని అవస రానికి అసలైన రుజువు.
ఐదో చికిత్స: మాతృభాషకు పట్టం
తెలుగు రాష్ట్రాల్లో జర్నలిజం ఉద్యోగాల్లో అధికభాగం తెలుగు పత్రికలు, చాన ళ్లు, డిజిటల్ వేదికల్లోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగానూ ఇదే వాస్తవం. భారత ప్రెస్ రిజి స్ట్రార్ జనరల్ 2023-24 నివేదిక ప్రకారం దేశంలో 1,51,474 పత్రికలు నమోదై ఉన్నాయి. భాషలవారీగా చూస్తే ఒక్క హిం దీలోనే నమోదైన ప్రచురణలు ఇంగ్లిష్ ప్రచురణలకు మూడు రెట్లకు పైగా ఉన్నా యి, తెలుగులోనూ ఐదు వేలకు పైగా ప్రచురణలు నమోదయ్యాయి. భారతీయ పత్రికారంగపు గుండె భారతీయ భాషల్లోనే కొట్టుకుంటోంది.
కానీ మన జర్నలి జం విద్య మాత్రం ఇంకా ఆంగ్లమాధ్యమ కేంద్రంగానే నడుస్తోంది. అయినా తెలుగులో వార్తా రచన, శీర్షికల కూర్పు, అను వాద నైపుణ్యం, తెలుగు శైలీ నియమాలు నేర్పే వ్యవస్థీకృత ప్రయత్నం చాలా బలహీనంగా ఉంది. ఒకే ఆంగ్ల పదానికి ఒక్కొ క్క పత్రికలో ఒక్కొక్క అనువాదం కనిపిస్తున్నాయంటే ఆ లోపం ఎక్కడ ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. జర్నలిజం విభాగాలు తెలుగు మాధ్యమ కోర్సులను బలోపేతం చేయాలి; తెలుగు జర్నలిజానికి సొంత పాఠ్యపుస్తకాలు, పారిభాషిక పదకోశాలు, శైలీ గ్రంథాలు రూపొందించాలి.
ఇది సాధ్యమేనని తెలుగు పత్రికారంగమే నిరూపించింది. 1976లోనే ఈనాడు సం స్థ తన సొంత జర్నలిజం పాఠశాలను ప్రారంభించింది. అక్కడ చేరిన ప్రతి కొత్త విలేకరి ప్రతివారం సాహిత్య క్లాసిక్‌లను చదివి, సమీక్ష రాసి, అనువాద అభ్యాసా లు చేయాల్సి ఉండేది. భాషలో కచ్చితత్వం కోసమే ఆ కఠోర శిక్షణ. ఒక పత్రికా సంస్థ దశాబ్దాల కిందటే చేయగలిగినది, ప్రభుత్వ నిధులు, అధ్యాపక బలగం ఉన్న విశ్వవిద్యాలయాలు ఎందుకు చేయలేవు?
అదే సమయంలో మాతృభాషపై ఉన్న భక్తి, ఇష్టత, ఆరాధన ఇతర భాషలపై వి ముఖతగా మారకూడదు. జర్నలిజం కోర్సుల్లో తెలుగు, ఇంగ్లిష్, హిందీ& ఈ మూడు భాషల్లో అనువాదం, వార్తా రచన ప్రత్యేక పాఠ్యాంశంగా ఉండాలి. మూడు భాషలు వచ్చిన జర్నలిస్టు మూడు రెట్ల విలువైనవాడు. భాషపై పట్టు లేని జర్నలిస్టు ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా ప్రజలకు చేరలేడు, దగ్గరకాలేడు.
ఆరో చికిత్స: మార్గదర్శనం, విలువ
ఒకప్పుడు న్యూస్‌రూమ్ ఒక గురుకులంలా పనిచేసేది. ప్రతిభ కనిపిస్తే గుర్తించి సానబెట్టే ఎడిటర్లు ఉండేవారు. ఇప్పుడు ఆ సంస్కృతి సన్నగిల్లుతోంది. ప్రతిభను ప్రోత్సహించే బదులు లేనిపోని భయాలు, అభద్రతలవల్ల అణచివేసే ధోరణి, వ్యక్తిగత లక్ష్యాలే ప్రధానమయ్యే వాతావరణం పెరిగింది. పైరవీలు, ప్రాపకాలు ప్రతిభను వెన క్కి నెట్టేస్తున్నాయి. ప్రతిభావంతుడిని చూసి భయపడే సీనియర్ ఉన్న చోట తరాలు ఎదగవు.
విశ్వవిద్యాలయాలే ఆ లోటును కొంతవరకు పూడ్చాలి. ప్రతి విద్యార్థికి ఒక సీని యర్ జర్నలిస్టును మార్గదర్శిగా జతచేసే మెంటార్షిప్ కార్యక్రమం ఉండాలి. నైతికతను పరీక్షా ప్రశ్నగా కాకుండా, నిజమైన కేసుల చర్చ ద్వారా నేర్పాలి. పెయిడ్ న్యూ స్ ఎందుకు ప్రమాదకరం, బాధితుల గోప్యతను ఎలా కాపాడాలి, ఒత్తిడి వచ్చినప్పుడు వాస్తవానికి ఎలా కట్టుబడాలి అనే అంశాలను చర్చల ద్వారా అర్థం చేయించాలి. అయితే విలువలు పాఠాలతో కాదు, ఆదర్శాలతో అబ్బుతాయి. నైతికత గురిం చి ఉపన్యాసాలు ఇచ్చేవారే అడ్డదారులు తొక్కితే, విద్యార్థి గుర్తుంచుకునేది ఉపన్యాసం కాదు, ఆ అడ్డదారే. సమాజం పట్ల నిబద్ధత, నిజాయితీ లేని జర్నలిస్టుకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంతటి నైపుణ్యం ఉన్నా సమాజానికి ప్రమాదకరమే.
బాధ్యత ఎవరిది?
ఈ ప్రక్షాళన ఒక్క విశ్వవిద్యాలయంతో సాధ్యం కాదు. యూజీసీ తాను తెచ్చిన మంచి విధానాలు కాగితాలకే పరిమితం కాకుండా అమలుపై కచ్చితమైన పర్యవేక్షణ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలి జం విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలి; ఆధునిక ల్యాబ్‌లకు నిధులు సమకూర్చాలి. మీడియా అకాడమీలు విశ్వవి ద్యాలయాలతో కలిసి శిక్షణ, పరిశోధన కార్యక్రమాలు చేపట్టాలి.
ప్రారంభంగా రాష్ట్రంలో ఒక విశ్వవిద్యాలయ జర్నలిజం విభాగాన్ని, రాష్ట్ర మీడియా అకాడమీని, ఒకటి రెండు మీడియా సంస్థలను కలిపి ఒక బోధనా వార్తాకేంద్రం పైలట్ ప్రాజెక్టును చేపట్టవచ్చు. రెండేళ్లలో దాని ఫలితా లను అంచనా వేసి, విజయవంతమైతే అన్ని విశ్వవిద్యాలయాలకు విస్తరించవచ్చు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రభావం చూపే సంస్కరణ ఇది.
అన్నింటికీ మించి మీడియా సంస్థలు ముందుకు రావాలి. రెడీమేడ్ జర్నలిస్టులు కావాలని ఫిర్యాదు చేసే సంస్థలు, వారిని తయారుచేసే ప్రక్రియలో భాగస్వాములు కావాలి. రెసిడెన్సీలు ఇవ్వాలి, తమ సీనియర్ సిబ్బందిని బోధనలోకి పంపాలి, సిలబస్ రూపకల్పనలో పాల్గొనాలి. అలా గే ఉద్యోగంలో చేరిన యువ జర్నలిస్టుకు గౌరవప్రదమైన జీతం, వృత్తి భద్రత కల్పించాలి.
పైన పేర్కొన్న అంతర్జాతీయ సర్వే ప్రకారం భారతీయ జర్నలిస్టులు వారానికి సగటున దాదాపు 57 గంటలు పనిచేస్తున్నారు; ప్రపంచంలోనే అత్యధిక పనిభారం ఉన్న దేశాల జాబితాలో భారత్ ఉంది. అయినా 44 శాతం మంది బతుకుదెరువు కోసం అదనపు ఉద్యోగాలు చేయాల్సి వ స్తోంది; దశాబ్దం కిందట ఇది 11.6 శాతమే. బతుకుదెరువు లేని వృత్తిలోకి ప్రతిభావంతులు రారు; వచ్చినా నిలవరు.
ముగింపు
ప్రపంచం ఇప్పటికే దారి చూపింది. అరిజోనాలో బోధనాసుపత్రి నమూనా, డెన్మార్క్‌లో ఏడాదిన్నర ఉద్యోగ శిక్షణ, అమెరికా అక్రెడిటేషన్ మండలి కఠిన ప్రమా ణాలు, యునెస్కో నమూనా పాఠ్యప్రణాళికలు, మన సొంత గడ్డపైనే ఒక పత్రికా సంస్థ దశాబ్దాలుగా నడిపిన జర్నలిజం పాఠశాల వంటి ఆధారాలకు కొదవ లేదు, నమూనాలకు కొరత లేదు. లోపించిందల్లా సంకల్పమే. ప్రజాస్వామ్యానికి నాలు గో స్తంభం పత్రికారంగం అని మనం తరచూ చెప్పుకుంటాం. ఆ స్తంభానికి పునాది వేసేవి జర్నలిజం విద్యాసంస్థలు.
పునాది బలహీనంగా ఉంటే స్తంభం ఎంతకాలం నిలుస్తుంది? సగం ఉడికిన చదువుతో వచ్చిన జర్నలిస్టు సగం సత్యాలనే రాస్తాడు; దాని మూల్యం చెల్లించేది సమాజమే. విశ్వవిద్యాలయాలు డిగ్రీల కర్మాగారాలుగా కాకుం డా, జర్నలిస్టులను తీర్చిదిద్దే కార్యశాలలుగా మారాలి. అధికారం కాదు, అర్హత ప్రాతిపదికగా; పైరవీ కాదు, ప్రతిభ కొలమానంగా నిలిచినప్పుడే ఆ మార్పు సాధ్యం. తరగతి గదికి, న్యూస్‌రూమ్ మధ్య ఉన్న గోడలు కూలి, వంతెనలు నిర్మితమైన రోజే జర్నలిజం విద్యకు నిజమైన సార్థకత.
- వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్టు, మీడియా పరిశోధకులు
(సమాప్తం)