రేపటి గురువులకు బోధకులేరీ?

30-10-2026 | 05:10am

తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయ కళాశాలలలో రెగ్యులర్ ఉపాధ్యాయులు లేక కాంట్రాక్టు ఉపాధ్యాయుల చేత ఉపాధ్యాయ శిక్షణలు పూర్తి చేస్తున్నారు.ప్రాథమిక పాఠశాల ల లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు బోధించడానికి ఉపాధ్యాయులుగా చేరడానికి ఇంటర్మీడియట్ (తత్సమాన) పూర్తి చేసిన తర్వాత డీ.ఎడ్ ( డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) పూర్తి చేసి ఉం డాలి. వారిని ఎస్జీటీలుగా ఎంపిక చేస్తారు.

ఉన్నత పాఠశాలలలో ఆరు నుంచి పదో త రగతి వరకు బోధించడానికి డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ, బీటెక్ తత్సమాన విద్యార్హతల ) తర్వాత బీ.ఎడ్ ( బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్) పూర్తి చేసిన తర్వాత స్కూల్ అసిస్టెంట్‌గా నియమిస్తారు. తెలుగు, హిం దీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ మిగతా దేశీయ భాషలు బోధించడానికి డిగ్రీ తర్వాత ఆయా భాషల పండిత శిక్షణ లేదా బీ.ఎడ్ లో రెండవ మెథడాలజీ దేశీయ భాషలు (తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ మిగతా దేశీయ భాషలు) పూర్తి చేసి ఉండాలి.

ఉపాధ్యాయ శిక్షణ డీ ఎడ్, బీ ఎడ్, పం డిత శిక్షణ పూర్తి చేసిన తర్వాత టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్ (టెట్) ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు గా చేరడానికి పేపర్ 1, ఉన్నత పాఠశాలలలో ఉపాధ్యాయులుగా చేరడానికి పేపర్ 2 ఉత్తీర్ణత సాధించిన తర్వాత డీఎస్సీ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఉపాధ్యాయ శిక్షణ కోసం డీ ఎడ్ కళాశాలలు, బీ ఎడ్ కళాశాలలు, ఐసీఎస్‌ఈ కళాశాలలున్నాయి. గత రెండు దశాబ్దాలకు పైగా ఉపన్యాసకుల (లెక్చరర్) పోస్టులు, ఆచార్యుల (ప్రొఫెసర్) పోస్టులు భర్తీ చేయక పోవడం వల్ల ఉన్న ఉపన్యాసకులు, ఆచార్యులు ఉద్యోగ విరమణ పొందడం వల్ల 95 శాతానికి పైగా ఖాళీలు ఉన్నాయి. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ఉపాధ్యాయులు లేక పోవడం వల్ల శిక్షణ నామమాత్రంగా జరిగి ఉత్తీర్ణత సాధిస్తున్నారు.

శిక్షణ పూర్తి చేయని ఛాత్రోపాధ్యాయులు తరగతి గదుల్లోకి వెళ్లగానే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నాయి. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ఉపాధ్యాయులను నియమించకుం డా ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేసి నా బూడిదలో పోసిన పన్నీరుగానే మారుతుంది. పుండు ఒక దగ్గరుంటే మందు ఒక దగ్గర పెట్టినట్లు ఉంది అన్న సామెతగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఉంది.

పదోన్నతులు ఇచ్చేదెప్పుడు?

తెలంగాణలోని ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయులకు పదోన్నతులు లేక 25, 26 సంవత్సరాలు గడు స్తున్నది. ఎస్జీటీ లుగా ఉపాధ్యాయ వృత్తి లో ప్రవేశించి ఎస్జీటీలుగానే ఉద్యోగ విరమణ చేస్తున్నారు. మనదేశ అత్యున్నత న్యా యస్థానం సుప్రీంకోర్టు నిబంధనల ప్రాతిపదికగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కనీసం మూడుసార్లు పదోన్నతులు కల్పించాల్సి ఉంది. ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయులకు మాత్రం పూర్తి సర్వీస్ కాలంలో ఒక్క పదోన్నతికి కూడా నోచుకోకపోవడం ఆం దోళనకరమైన విషయం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఎస్జీటీ ఉపాధ్యాయులకు మాత్రం పదోన్నతులు రావడం లేదు.

విద్యా వ్యవస్థలో విచిత్ర పరిస్థితి.. 

విద్యావ్యవస్థలో టీచింగ్, నాన్ టీచింగ్ అని రెండు వ్యవస్థలు ఉన్నాయి. టీచింగ్ (ఉపాధ్యాయులు) ఎలాంటి పదోన్నతులకు నోచుకోకుండా ఉంటే నాన్ టీచింగ్ వాళ్ళు జూనియర్ అసిస్టెంట్‌గా, కారుణ్య నియామకాలు లేదా నేరుగా ఎంపికైన వారు సూపరింటెండెంట్, అసిస్టెంట్ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీఈ ఓ)గా పదోన్నతులు పొందుతున్నారు. తమ కళ్ళముందు జూనియర్ అసిస్టెంట్‌గా చేరిన వారు వరుసగా పదోన్నతులు పొందుతుంటే ఉపాధ్యాయులు మాత్రం ఏ పోస్టులో ఎంపికైతే అదే పోస్ట్‌లో విరమణ చేయాల్సి రావడం శోచనీయం.

ఇన్‌సర్వీస్ వాళ్లకు పదోన్నతులివ్వాలి

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోనూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు 66.6 శాతం పదోన్నతులు పద్ధతిలో ఎంపిక చేయాలని, 33.3 శాతం నేరుగా ఎంపిక చేయాలనే నిబంధనలు ఉన్నాయి. అనేక మంది ఉపాధ్యాయులు ఎం ఎడ్, పీహెచ్‌డీ, స్లెట్, నెట్, జేఆర్‌ఎఫ్, ఇంకా మూడు, నాలుగు పీజీలు విద్యా శాఖ అనుమతి తీసుకొని పూర్తి చేసి పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు.

గత రెండు, మూడు దశాబ్దాల నుంచి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ఉపాధ్యాయు లు లేక కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల చేత బోధించడం వల్ల పదోన్నతులు వస్తాయని ఎదురుచూసిన ప్రతిభ కలిగిన అత్యున్నత డిగ్రీలు, పీజీలు చేసిన వారు ఎలాంటి పదోన్నతులకు నోచుకోకుండా విరమణ పొందాల్సి వస్తోంది. ఎంతో కష్టపడి ఎంతో ప్రతిభ కలిగిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయల ప్రతిభ బూడిదలో పోసిన పన్నీ రుగా మారుతున్నది.

ప్రత్యేక తెలంగాణలో పది సంవత్సరాలు ఎలాంటి పదోన్నతులకు నోచుకోకుండా ఉన్న ఉపాధ్యాయులు, భాషా పండితులకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదోన్నతులు కల్పించారు. విద్యారంగ మంత్రిత్వ శాఖను ఎవరికి కేటాయించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించడంతో విద్యా వ్యవస్థలో రెండు, మూడు దశాబ్దాల నుండి సర్వీస్ రూల్స్ పేరుతో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ఉపాధ్యాయులను నియమించకుండా నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో 33.3 శాతం భర్తీ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేశారు.

నవంబర్‌లో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో డైట్, బీఎడ్, ఐసీఎస్‌ఈ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ), డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ( డిప్యూటీ ఈవో ) పరీక్షలను నిర్వ హించి డిసెంబర్‌లో భర్తీ చేయనున్నారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా 33.3 శాతం భర్తీ చేస్తే.. 66.6 శాతం ఇన్ సర్వీస్ టీచర్లకు అర్హత, సీనియారిటీ కలిగిన ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటి అని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఇన్ సర్వీస్ టీచర్లకు ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో పదోన్నతులు కల్పించాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు.

వ్యాసకర్త : టీఆర్‌టీఎఫ్

ప్రధాన కార్యదర్శి, 9290826988

డాక్టర్ ఎస్ విజయ భాస్కర్

మరిన్ని వార్తలు