విద్యార్థులకు నాణ్యమైన విద్య
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
చెన్నూర్, (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Minister Gaddam Vivek Venkatswamy) అన్నారు.
బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అదనపు గదులు, పూర్తి చేయబడిన మరుగుదొడ్లు, స్నానప గదులను గిరిజన సంక్షేమ అధికారి సురేష్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, చైర్మన్ పెద్దింటి పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ ప్రసాద్, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థులకు అవసరమైన సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ క్రమంలో చెన్నూర్ లోని గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 38 లక్షల రూపాయల డి.ఎం.ఎఫ్.టి. నిధులతో ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో అదనపు తరగతి గదుల మిగిలిన నిర్మాణ పనులు, 35 లక్షల రూపాయల సి.ఎస్.ఆర్. నిధులతో అదనపు గదులు, ప్రధాన, సాధారణ మరమ్మత్తులు, మరుగుదొడ్లు, స్నానపు గదుల పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.
విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించడం ద్వారా ప్రభుత్వ విద్యా సంస్థలలో నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు 2 జతల ఏకరూప దుస్తులు, మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారం, శుద్ధమైన త్రాగునీరు, నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు అందించడం జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి విద్యార్థులకు అన్ని సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని, క్రమశిక్షణ, ఏకాగ్రతతో చదివి వార్షిక పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని తెలిపారు.