మంథనిలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథని పట్టణంలో పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి
మృతుల చిత్రపటాలకు నివాళులు.. ప్రగాఢ సానుభూతి
మంథని, అక్టోబర్ 07 (విజయక్రాంతి): మంథని పట్టణంలో ఇటీవల వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Dudhilla Sridhar Babu) బుధవారం పరామర్శించారు. పట్టణ పర్యటనలో భాగంగా ఆయన పలు బాధిత కుటుంబాల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారిని ఓదార్చారు.
పట్టణంలోని గోదావరి గౌతమేశ్వర స్వామి ఆలయ సమీపంలో నివాసముండే గట్టు సుశీల, పెంజర్ కట్ట ప్రాంతానికి చెందిన మున్ననూరి ఆనందదేవి, నడివీధి లక్ష్మీనారాయణ ఆలయ సమీప నివాసి చొప్పకట్ల శంకర్ రావు, అలాగే ఉస్మాన్‌పురాకు చెందిన ఎండి వలి ఇటీవల మృతి చెందారు. ఆయా కుటుంబాలను మంత్రి శ్రీధర్ బాబు కలిసి మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. వారికి పార్టీ పరంగా, వ్యక్తిగతంగా అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంథని మునిసిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.