గియాకోమో ఫిలిబెక్‌ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

17-11-2026 | 07:04pm

హనుమకొండ, నవంబర్ 17 (విజయక్రాంతి): భారతదేశ సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్య వ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 'పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్' సెక్రటరీ జనరల్ గియాకోమో ఫిలిబెక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నాయకురాలు రావు పద్మ రెడ్డి(BJP leader Rao Padma Reddy) డిమాండ్ చేశారు.

మంగళవారం బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవి కుమార్, కాళీ ప్రసాద్ లతో వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రావు పద్మ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో జరిగిన 'భారత్ సమ్మిట్' వేదికగా భారత రాజ్యాంగ, ప్రజాస్వామ్య ప్రక్రియలను విదేశీ ప్రతినిధులు బహిరంగంగా ప్రశ్నించడం తీవ్ర ఆక్షేపణీయమని పేర్కొన్నారు.

సదస్సులో దేశ వ్యతిరేక శక్తులు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేతలు చప్పట్లు కొడుతూ ప్రోత్సహించడం అత్యంత దురదృష్టకరమని ఆమె విమర్శించారు. భారత గడ్డపై ఉంటూ మన ప్రజాస్వామ్యాన్ని అవమానించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆమె స్పష్టం చేశారు. దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, ఈ విషయం పై రానున్న రోజుల్లో మరిన్ని  కార్యక్రమాలు చేపడతామని రావు పద్మ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు