కొండా మురళికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి

17-11-2026 | 07:47pm

అధిష్టానం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.. బీసీ జేఏసీ డిమాండ్

హుజురాబాద్ నియోజకవర్గ బీసీ జేఏసీ నాయకులు చందుపట్ల జనార్ధన్, సందేల వెంకన్న డిమాండ్.

హుజురాబాద్ ప్రతినిధి, నవంబర్ 17 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీసీ నేతగా తిరుగులేని గుర్తింపు పొందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొండా మురళి(Congress leader Konda Murali)కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించాలని హుజురాబాద్ నియోజకవర్గ బీసీ జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షుడు సందేల వెంకన్న మాట్లాడుతూ కొండా మురళి పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలుస్తూ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారన కొనియాడారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని, అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. అధిష్టానం ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి తన అనుచరులతో కలిసి కొండా మురళి విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు.

కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి కల్పించడం ఒక్క వ్యక్తికి సంబంధించిన అంశం కాదని, ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని అన్నారు. పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల గొంతుకను శాసనమండలిలో వినిపించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కొండా మురళికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ప్రకటించాలని బీసీ సంఘాలు, బీసీ మేధావుల తరఫున కోరుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, ఉపాధ్యక్షులు మానూరి ప్రవీణ్ కుమార్, కొలిపాక క్రాంతికుమార్, బీసీ జాతీయ సంఘం హుజురాబాద్ నియోజకవర్గ మహిళా జనరల్ సెక్రటరీ దేవసాని ప్రియదర్శిని, బీసీ నాయకులు మంచిగట్ల విజయకుమార్, కన్నెబోయిన రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు