ఖేలో ఇండియా పోటీల ఏర్పాట్లు వేగవంతం చేయాలి
- హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హనుమకొండ, నవంబర్ 28(విజయక్రాంతి): హనుమకొండలోని(Hanamkonda) జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం(Jawaharlal Nehru Stadium)(జేఎన్ఎస్)లో జాతీయస్థాయి ఖేలో ఇండియా అథ్లెటిక్స్ పోటీల(Khelo India Athletics Competitions) నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు. శనివారం జేఎన్ఎస్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు, క్రీడా పోటీల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 18 నుంచి 21వ తేదీ వరకు హనుమకొండలోని జేఎన్ఎస్ లో జరగనున్న ఖేలో ఇండియా అథ్లెటిక్స్ పోటీలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను త్వరగా సిద్ధం చేయాలన్నారు. అథ్లెట్ల ప్రాక్టీస్‌కు అనువుగా వార్మప్ ట్రాక్‌ను సిద్ధం చేయడంతో పాటు, ఫ్లడ్‌లైట్లను త్వరగా ఏర్పాటు చేయాలన్నారు.
స్టేడియంలోని ట్రాక్ పరిసరాలు, మైదానం పచ్చదనంతో ఉండేలా స్ప్రింక్లర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం స్పోర్ట్స్ స్కూల్‌లోని క్రీడాకారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఖేలో ఇండియా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఖేలో ఇండియా నోడల్ అధికారి పవన్, జిల్లా యువజన క్రీడల అధికారి కె.ప్రశాంత్ ఇతర అధికారులు పాల్గొన్నారు.