సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి కృషి చేస్తా
- హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి
ఎల్బీనగర్, నవంబర్ 28 : సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి(Welfare of Senior Citizens), గౌరవప్రదమైన జీవనానికి తన వంతు కృషి చేస్తానని హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి(Former Hayathnagar Corporator Kallem Navajeevan Reddy) అన్నారు. హైకోర్టు కాలనీ డివిజన్ లోని శారదా నగర్లో శనివారం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం 20వ వార్షికోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ... కుటుంబాలకు, సమాజానికి ఎన్నో సేవలు అందించిన పెద్దలను గౌరవించడం, వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
సమాజ నిర్మాణంలో సీనియర్ సిటిజన్ల పాత్ర ఎంతో కీలకమని, వారి అనుభవాలు, ఆశీర్వాదాలు యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ సర్కిల్ ఆసరా కమిటీ వైస్ చైర్మన్ యాది రెడ్డి, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ రావు, కాలనీ అధ్యక్షుడు ప్రదీప్, సీనియర్ సిటిజన్ సభ్యులు హరినాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు.