ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దోపిడీ
- మన్సూరాబాద్ డివిజన్ చందేశ్వర్ కాలనీలో చోరీ
- ముసుగు ధరించి రూ. 3.20 కోట్ల నగదు దోపిడీ
ఎల్బీనగర్, నవంబర్ 28 : ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్(LB Nagar Police Station) పరిధిలో భారీ దోపిడీ కేసు(Robbery case) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మన్సూరాబాద్ డివిజన్(Mansoorabad division) లోని చందేశ్వర్ కాలనీలో ప్లాట్ నం. 61 ఇంట్లో ఇంట్లోకి శనివారం ముసుగు ధరించిన నలుగురు వ్యక్తులు మొత్తం రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివసిస్తున్న కొమ్మరవెల్లి సంపత్ కుమార్ రెడ్డికి చెందిన రూ, 3.20 కోట్ల నగదును, ఆయన తన బావమరిది అయిన కుంభం విజయ్ కుమార్ రెడ్డి ఖాతాకు బదిలీ చేశారు. ఆ మొత్తాన్ని విజయ్ కుమార్ రెడ్డి బ్యాంకు నుంచి నగదు రూపంలో తీసుకున్నారు.
ఈ డబ్బును భారతదేశంలో ఆస్తి కొనుగోలు కోసం ఉద్దేశించారు. నవంబర్ 22వ తేదీన ఉదయం కుంభం విజయ్ కుమార్ రెడ్డి రూ.3.20 కోట్ల నగదును మన్సూరాబాద్, రోడ్ నం. 2, చందేశ్వర్ కాలనీ, ప్లాట్ నం. 61లోని సామ ప్రవీణ్ నివాసంలో భద్రపరిచారు. ఆ సమయంలో విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు ఒక బంధువు వివాహానికి వెళ్తుండటంతో, ఈ నగదును అక్కడ ఉంచారు.
కాగా, శనివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ప్రవీణ్ కుటుంబ సభ్యులు మణేమ్మ, మౌనిక ఇంట్లో ఉండగా ముసుగు ధరించిన నలుగురు దుండగులు వచ్చి, వారి చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి, బెడ్రూమ్లోని బీరువాను పగలగొట్టి, అందులో ఉన్న రూ.3.20 కోట్ల నగదు మొత్తాన్ని తీసుకుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ సీఐ వెంకటేశం సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని చోరీ విధానాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీని సేకరించి విశ్లేషిస్తున్నారు.