గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సమగ్ర ప్రణాళిక

28-11-2026 | 10:59pm

ఘాట్ల వారీగా, శాఖల వారీగా ప్రతిపాదనలను పి పి టి ద్వారా సమీక్షించిన కలెక్టర్ 

జగిత్యాల, నవంబర్ 28 ( విజయక్రాంతి ) : జగిత్యాల జిల్లాలో(Jagtial District) 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ ఏర్పాట్లకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్(Jagtial Collector B Satyaprasad) ఆదేశించారు. శనివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) లో సంబంధిత శాఖల అధికారులతో గోదావరి పుష్కరాలు(Godavari Pushkarams )–2027 ఏర్పాట్లపై పి పి టి ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ పరిధిలో చేపట్టాల్సిన పనులు, ఘాట్ల వారీగా అవసరమైన సౌకర్యాలు, తాత్కాలిక ఏర్పాట్లు, అంచనా వ్యయాలు తదితర అంశాలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు జిల్లాలోని వివిధ ఘాట్లకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్, రవాణా, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రత, వసతి తదితర అన్ని అంశాలపై ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలన్నారు.

ప్రతి ఘాట్ వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన సౌకర్యాలను గుర్తించాలని, ఘాట్లను మూడు కేటగిరీలుగా విభజించి టైర్ I,  టైర్ II, టైర్ III ( Tier-I, Tier-II, Tier-III ) వారీగా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. భక్తులు జిల్లాలోకి ప్రవేశించినప్పటి నుంచి పుష్కర స్నానాలు, దేవాలయ దర్శనం, భోజనం, విశ్రాంతి అనంతరం తిరిగి వెళ్లే వరకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

ప్రతి శాఖ తమ పరిధిలో చేపట్టాల్సిన పనులు, అవసరమైన సిబ్బంది, సామగ్రి, వాహనాలు, భూముల వివరాలు, ఆర్థిక అంచనాలను స్పష్టంగా రూపొందించాలని ఆదేశించారు. అంచనా వేసిన భక్తుల సంఖ్య కంటే అదనంగా భక్తులు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలన్నారు. అత్యవసర సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా సిబ్బందిని నియమించేందుకు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.

పోలీస్, రెవెన్యూ, దేవాదాయ, వైద్య ఆరోగ్య, నీటిపారుదల, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, రవాణా, ఆర్టీసీ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ తమకు కేటాయించిన బాధ్యతలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, నదీ ప్రవాహం, గజ ఈతగాళ్లు, రెస్క్యూ బోట్లు, వైద్య శిబిరాలు, తాగునీరు, పారిశుధ్యం వంటి అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.

అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించి వాస్తవ అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పనుల అంచనాలు, సిబ్బంది అవసరాలు, నిర్వహణ వ్యయాలను స్పష్టంగా పొందుపరచాలని కలెక్టర్ ఆదేశించారు. పుష్కరాల నిర్వహణకు చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు.

గోదావరి పుష్కరాలు – 2027ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన సేవలు అందించేలా అవసరమైన ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో కిషన్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు