చదువుతోపాటు క్రీడలూ ముఖ్యమే

28-11-2026 | 10:45pm

ఎంపీ రఘునందన్ రావు

చేగుంట నవంబర్ 28,విజయక్రాంతి : విద్యార్థులు(Students) చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు(Medak MP Raghunandan Rao) అన్నారు. శనివారం చేగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో(Government Junior College, Chegunta) నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అండర్‌-14, 17, 19 బాలబాలికల ఫెన్సింగ్ పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడల ద్వారా ఆరోగ్యంతోపాటు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో 2 శాతం క్రీడా కోటా ఉపయోగపడుతుందని తెలిపారు.

ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పోటీల్లో వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు వచ్చే నెల మొదటి వారంలో కరీంనగర్ జిల్లా రేకుర్తిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు కోచ్ కరణం గణేష్ రవికుమార్ తెలిపారు. విజేతలను ఉమ్మడి మెదక్ జిల్లా క్రీడా సంఘం ప్రతినిధులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున్, స్పోర్ట్స్ ఇన్‌చార్జి ప్రమోద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, పలువురు నాయకులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు