బాలల ఆవిష్కరణలకు పెద్దల ప్రోత్సాహం కరువు!

28-11-2026 | 10:48pm

* ప్రాజెక్టులను పరిశీలించని కలెక్టర్, ఇన్‌చార్జి మంత్రి.

* ఎంపీ కోసం ఎదురుచూసి నిరాశ చెందిన విద్యార్థులు

సిద్దిపేట టౌన్, నవంబర్ 28: జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు 152 వినూత్న ప్రాజెక్టులతో తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రతిభను ప్రదర్శించిన చిన్నారుల ప్రాజెక్టులను పరిశీలించేందుకు కలెక్టర్, ఇన్‌చార్జి మంత్రి హాజరుకాకపోవడం నిరాశ కలిగించింది. ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) వస్తారని ప్రకటించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు(Students, teachers) ఎదురుచూసినా ఆయన రాలేదు. దీంతో ముగింపు వేడుక ఆలస్యమై చలి, చీకటిలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 వ్యవసాయం, నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ ఇంధనం, పర్యావరణ పరిరక్షణ అంశాలపై రూపొందించిన నమూనాలు ఆకట్టుకున్నాయి. రైతులకు ఉపయోగపడే సీడర్, వీడర్, స్ప్రేయర్, స్మార్ట్ రెయిన్‌వాటర్ కన్జర్వేషన్, సాయిల్ మాయిశ్చర్ అలర్ట్ ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ ఫ్యూచర్ ఇన్నోవేటర్ ఛాలెంజ్‌కు 30 ప్రాజెక్టులు, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌కు 130 నామినేషన్లు ఎంపికయ్యాయి.

సైన్స్ డ్రామాలో రాష్ట్రస్థాయిలో మూడో స్థానం సాధించడంతో పాటు 35 ప్రాజెక్టులు వివిధ విభాగాల్లో ఎంపికయ్యాయి. కార్యక్రమంలో డీఈఓ రమేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలని సూచించగా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం ఉపాధ్యాయుల సేవలను గౌరవించాలని పేర్కొన్నారు. 

బహుమతులు ఇవ్వడమే ప్రోత్సాహం కాదు, విద్యార్థుల ఆవిష్కరణలను పరిశీలించి అభినందించడం, గైడ్ టీచర్ల కృషిని గుర్తించడం కూడా పెద్దల బాధ్యత. రేపటి శాస్త్రవేత్తలుగా ఎదగాల్సిన చిన్నారులకు ప్రత్యక్ష ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ విద్యార్థుల తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు