సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.. వరంగల్ సీపీ ఎన్. శ్వేత

07-10-2026 | 10:43pm

“ఆగండి… ఆలోచించండి… అడుగువేయండి” 

సైబర్ క్రైమ్ అవేర్‌నెస్ పోస్టర్ల ఆవిష్కరణ.

హనుమకొండ, అక్టోబర్ 7 (విజయక్రాంతి): తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(Telangana Cyber ​​Security Bureau) ఆధ్వర్యంలో ఈ అక్టోబర్ నెలను సైబర్ మోసాలపై అవగాహన కల్పించే నెల గా ప్రకటించి, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు.

ఫోన్ కాల్స్, మెసేజెలు, వాట్సప్ మెసేజ్‌లు, ఈ-మెయిల్స్ లేదా అనుమానాస్పద లింకులు వచ్చినప్పుడు “ఆగండి… ఆలోచించండి… ధృవీకరించండి” అనే విధానాన్ని పాటించాలని తెలిపారు.కేవైసీ బ్యాంక్ ఖాతా బ్లాక్, లాటరీ, ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులపై భారీ లాభాలు వంటి పేర్లతో వచ్చే మోసపూరిత కాల్స్, సందేశాలను నమ్మవద్దని సూచించారు. ఆన్‌లైన్ షాపింగ్‌లో భారీ డిస్కౌంట్లు, అతి తక్కువ ధరల పేరుతో వచ్చే నకిలీ వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, కొనుగోలు చేసే ముందు వెబ్‌సైట్, విక్రేత వివరాలను ధృవీకరించు కోవాలని  తెలిపారు.

డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ లాంటి వివరాలు, పాస్‌వర్డ్‌లు ఎవరితోనూ పంచుకోరాదని, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదని స్పష్టం చేశారు. అత్యవసరంగా డబ్బును పంపాలని ఒత్తిడి చేసే వ్యక్తులను నమ్మవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 కు కాల్ చేసి, cybercrime.gov.inలో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించే సైబర్ క్రైమ్ అవేర్‌నెస్ పోస్టర్లను వరంగల్ పోలీస్ కమిషనర్  ఎన్.శ్వేత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మినిస్ట్రేషన్) రాయల ప్రభాకర్ రావు, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు