నకిలీ భూ పత్రాల ముఠా గుట్టురట్టు: మల్కాజ్గిరి కమిషనర్ బి. సుమతి

07-10-2026 | 11:01pm

ఇద్దరు అరెస్ట్, 9 కత్తులు, 22 నకిలీ స్టాంపులు స్వాధీనం..

సికింద్రాబాద్ (విజయక్రాంతి): నకిలీ భూ పత్రాలు(Fake Land Document), ప్రభుత్వ అధికారుల నకిలీ స్టాంపులు సృష్టించి అమాయకులను మోసగిస్తున్న ముఠా గుట్టును మల్కాజిగిరి ఎస్‌వోటీ, స్థానిక పోలీసులు రట్టు చేశారు. మౌలాలీ చందా బాగ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్, కీసర పీఎస్ రౌడీషీటర్ మహ్మద్ ఖాజా పాషా, లాలాగూడ రైల్వే క్వార్టర్స్‌కు చెందిన మహ్మద్ జుల్ఫికర్ అలీ అలియాస్ చందులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీరి వద్ద నుంచి తొమ్మిది మారణాయుధాలు (కత్తులు), సబ్ రిజిస్ట్రార్, గ్రామ పంచాయతీ, ఇతర అధికారుల పేర్లతో ఉన్న 22 నకిలీ రబ్బర్ స్టాంపులు, ఖాళీ బాండ్ పేపర్లు, డెల్ కంప్యూటర్, కలర్ ప్రింటర్ మరియు నకిలీ భూ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో కీలక పాత్ర పోషించిన అల్వాల్‌కు చెందిన వినోద్ కుమార్ పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం, ప్రధాన నిందితుడు ఖాజా పాషాపై గతంలోనే 11 భూ వివాదాలు, ఇతర నేరాల కేసులు ఉన్నాయి. వివాదాల్లో ఉన్న, యజమానులు లేని భూములను లక్ష్యంగా చేసుకుని, సంబంధిత యజమానుల వివరాలు, డెత్ సర్టిఫికెట్లు, లీగల్ హైర్ పత్రాలను సేకరించేవాడు.

అనంతరం జుల్ఫికర్ అలీ, వినోద్ కుమార్‌ల సహకారంతో నకిలీ బాండ్ పేపర్లు, గుర్తింపు కార్డులు, ఇతర దస్తావేజులు సృష్టించి అసలైన యజమానుల స్థానంలో ఇతరులను ప్రవేశపెట్టి అమాయకులకు ఆ భూములను విక్రయించి సొమ్ము చేసుకునేవారు.విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి పర్యవేక్షణలో డీసీపీలు, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్ల బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించి నిందితులను పట్టుకుంది. భూములు, స్థలాలు కొనుగోలు చేసే సమయంలో బ్రోకర్లు చూపించే పత్రాలను గుడ్డిగా నమ్మవద్దని, రిజిస్ట్రేషన్ మరియు రెవెన్యూ రికార్డులు, లిటిగేషన్ వివరాలు స్వయంగా పరిశీలించుకోవాలని పోలీస్ కమిషనరేట్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు