మైహోమ్ జెవెల్‌లో మంటలు తప్పిన పెను ప్రమాదం!

07-10-2026 | 11:04pm

శేరిలింగంపల్లి, అక్టోబర్ 7 (విజయక్రాంతి): చందానగర్‌ పరిధిలోని మైహోమ్ జెవెల్‌ అపార్ట్‌మెంట్‌(My Home Jewel Apartment)లో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 12వ బ్లాక్‌లోని 14వ అంతస్తు, ప్లాట్‌ నంబర్‌ 1409లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో నివాసితులు ఆందోళనకు గురయ్యారు. మంటలను గుర్తించిన అపార్ట్‌మెంట్‌ సిబ్బంది వెంటనే స్పందించి భవనంలోని ఫైర్‌ఫైటింగ్‌ పైప్‌లైన్‌ వ్యవస్థను వినియోగించడంతో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకువచ్చారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ ఇంజన్‌తో ఘటనాస్థలికి చేరుకునే సమయానికి మంటలు దాదాపుగా పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు తెలిసింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదని మియాపూర్‌ సీఐ జయరామ్‌ తెలిపారు. మంటలు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా చెలరేగాయా, మరేదైనా కారణమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లో అందుబాటులో ఉన్న అగ్నిమాపక వ్యవస్థను సిబ్బంది సకాలంలో వినియోగించడంతో ప్రమాదం తీవ్రతరం కాకుండా నివారించినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు