వేయి స్తంభాల దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం
* భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసిన ఎమ్మెల్యే..
* కులమతాలకు అతీతంగా భక్తి చైతన్యాన్ని పెంపొందించే పవిత్ర మాసం కార్తీక మాసం: నాయిని
హనుమకొండ, నవంబర్ 10 (విజయక్రాంతి): చారిత్రక శ్రీ రుద్రేశ్వర స్వామి (వేయి స్తంభాల దేవాలయం) ఆలయం(Sri Rudreshwara Swamy Temple)లో కార్తీక మాసోత్సవాలు మంగళవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్తీక మాసోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో మంగళ వాయిద్యాల నడుమ ఉత్తిష్ఠ గణపతి ఆరాధనతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం రుద్రేశ్వర స్వామివారికి 11 లీటర్ల ఆవుపాలతో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించడంతో పాటు సామూహిక రుద్రాభిషేకాలు జరిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కార్తీక మాసం భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, భక్తిభావాన్ని పెంపొందించే అత్యంత పవిత్రమైన మాసమని పేర్కొన్నారు.
ముఖ్యంగా మహిళలు కులమతాలకు అతీతంగా సామూహికంగా దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం ఈ మాసం ప్రత్యేకత అని తెలిపారు. ఎంతో చారిత్రక ప్రాశస్త్యం కలిగిన వేయి స్తంభాల దేవాలయంలో పరమశివుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొనడం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పుప్పాల ప్రభాకర్, నాగరాజు, తోట వెంకటేశ్వర్లు, బోడ డిన్న, ఆలయ కార్యనిర్వహణాధికారి డి. అనిల్ కుమార్, ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.