తెలంగాణ ఉద్యమకారుల మహా పాదయాత్రను విజయవంతం చేయాలి

17-11-2026 | 07:02pm

హనుమకొండ, నవంబర్ 17 (విజయ క్రాంతి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర(Telangana State) సాధనలో ఉద్యమానికి ఊపిరి పోసిన ఉద్యమకారులకు ప్రత్యేక రాష్ట్రంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదని బీసీ సంక్షేమ సంఘం(BC Welfare Association) ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.

మంగళవారం హన్మకొండ  నయీంనగర్ లోని బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా కన్వీనర్  తమ్మల శోభారాణి చేపట్టనున్న పాదయాత్ర కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ నాడు తెలంగాణ ఉద్యమ జ్వాలను రగిలించింది ఉద్యమ కారులేనని,నేడు ఆ ఉద్యమకారుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు.వారికి అధికారంలో వాటా లేదు, నీళ్లు, నిధులు, నియామకా లలో వాటా లేదు,ఇది అమరవీరుల ఆశయానికి తూట్లు పొడిచినట్లేనన్నారు.

తెలంగాణా ఉద్యమ నాయకురాలు తమ్మల శోభారాణి చేస్తున్న ఈ పోరాటం, ఈ పాదయాత్ర మరో ఉద్యమ జ్వాలను రగిలించే విధంగా ఉందని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం నాడు పోరాటం - ఆత్మగౌరవం, అధికార పదవుల కోసం నేడు కదం తొక్కుదాం అనే ఆమె నినాదం ప్రతి ఉద్యమకారుడి గుండెల్లో మారుమోగాలని పిలుపునిచ్చారు.

ఈ పాదయాత్రతో నైనా ప్రభుత్వం దిగివచ్చి, ఉద్యమకారులకు అధికారంలో వాటా, నీళ్లు, నిధులు, నియామకా లలో వాటా ఇచ్చే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులంతా ఈ పాదయాత్రలో పాల్గొని ఈ పాదయాత్ర విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

వరంగల్ పోచమ్మమైదాన్ రాణి రుద్రమదేవి విగ్రహం నుండి హైదరాబాద్ లోని అమరవీరుల స్మారక భవనం వరకు సాగే ఈ పాదయాత్రకు బీసీ సంక్షేమ సంఘం పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో తెలంగాణా ఉద్యమ కారులు నారెడ్ల విజయ, కొడపాక అన్నపూర్ణ, గిరిబోయిన రాధిక, ఇంజె బావన, జూపక ఇందిరా, ప్రమాదదేవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు