ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా ఎన్నికల అధికారి
భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, ఇతర సాంకేతిక అంశాల పరిశీలన
జగిత్యాల,(విజయ క్రాంతి): ఎన్నికల సంఘం ఆదేశానుసారం సాధారణ తనిఖీ లో భాగంగ ధరూర్ క్యాంప్‌లోని ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు) గోదామును జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్(Collector B. Satyaprasad) శనివారం తనిఖీ చేశారు. ప్రతి నెల నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా గోదాములో భద్రపరిచిన ఈవీఎం యంత్రాల భద్రత(EVM Warehouse Security), గోదాము వద్ద చేపట్టిన రక్షణ ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, ఇతర సాంకేతిక అంశాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. గోదాము పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతున్న తీరును సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గోదాము వద్ద ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థ నిరంతరం పనిచేసేలా చూడాలని, సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసూనాంబ, జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, ఎలక్షన్ సూపరిండెంట్ జ్యోతి, జగిత్యాల అర్బన్ తహసీల్దార్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.