కమ్యూనిటీ మీడియేషన్, సీనియర్ సిటిజన్స్ చట్టంపై అవగాహన
జగిత్యాల,(విజయక్రాంతి): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సరిత మట్ట(Legal Services Authority Secretary Saritha Matta) ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం(Retired Employees' Association) భవనంలో కమ్యూనిటీ మీడియేషన్, సీనియర్ సిటిజన్స్ చట్టం(Senior Citizens Act)పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నచిన్న కుటుంబ, సామాజిక, స్థానిక వివాదాలను కోర్టులకు వెళ్లకుండా ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో కమ్యూనిటీ మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోవచ్చని వివరించారు.
అదేవిధంగా, సీనియర్ సిటిజన్ల హక్కులు, వారి రక్షణ, పోషణ, సంక్షేమం కోసం చట్టంలో కల్పించిన నిబంధనల గురించి అవగాహన కల్పించారు. వృద్ధులు తమ హక్కులకు భంగం కలిగినప్పుడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సి.హెచ్. అనురాధ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.