శేరుపల్లిలో పశువైద్య శిబిరం

05-11-2026 | 08:33pm

శ్రీరంగాపూర్, నవంబర్ 5: శ్రీరంగాపూర్ మండలంలోని శేరుపల్లి గ్రామంలో గురువారం పశుసంవర్ధక శాఖ(Department of Animal Husbandry) ఆధ్వర్యంలో పశుమిత్రుల సహకారంతో ఉచిత పశువైద్య ఆరోగ్య, సంతానోత్పత్తి సామర్థ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 24 మంది రైతులు తమ 50 పశువులను తీసుకురాగా, వాటిలో 32 గేదెలు, 18 ఆవులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఆవులు, గేదెలలో గర్భకోశ సంబంధిత సమస్యలు, సంతానోత్పత్తి లోపాలను గుర్తించి అవసరమైన పరీక్షలు నిర్వహించారు. చిన్న దూడలకు నట్టల నివారణ మందులు అందజేశారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణ, సకాలంలో వైద్య సేవలు పొందడం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.

గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు పచ్చిమేత లభ్యత పెంచేందుకు వృథాగా ఉన్న భూముల్లో పశుగ్రాస సాగు, అభివృద్ధి అవకాశాలను వివరించారు. ఏడాది పొడవునా పశువులకు నాణ్యమైన పచ్చిమేత అందేలా రైతులు కృషి చేయాలని సూచించారు. పశువులకు సకాలంలో వైద్యం అందించడం, సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటయ్య గౌడ్ శిబిరాన్ని సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ మాధవి, పశుమిత్రుల పర్యవేక్షకురాలు భారతీశా, పశుమిత్రుడు గోవిందు, సిబ్బంది ఓ.ఎస్. రంగస్వామి, పాల పరిశ్రమ శిక్షణ పొందిన సురేష్, గ్రామ సర్పంచ్ మేకల వెంకటయ్య, పలువురు రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు