డిఫాల్టర్ రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు

05-11-2026 | 08:44pm

- సిపిఐ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో  సీఎంఆర్ టెండర్ ధాన్యం బకాయిపడి డిఫాల్టర్లైన రైస్ మిల్లర్లపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వారి ఆస్తులతో పాటు ష్యూరిటీలుగా ఉన్న వారి ఆస్తులను కూడా జప్తు చేయాలని సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ... 250 కోట్ల రూపాయలకు పైగా మిల్లర్లు ప్రభుత్వానికి బకాయి ఉన్నారనే సమాచారం తెలుస్తుందని, డిఫాల్టర్ల నుండి ప్రజాధనాన్ని రికవరీ చేయడానికి రెవెన్యూ అధికారులు నామమాత్రంగా నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారని అన్నారు.

చట్ట ప్రకారం డిఫాల్టర్ల ఆస్తులు జప్తు చేయాలని, మిల్లర్లకు సివిల్ సప్లై కార్పొరేషన్ కు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం డిఫాల్టర్లకు షూరిటీగా ఉన్న వారి ఆస్తులను కూడా జప్తు చేయాల్సిన అవసరం ఉందని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో   జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి,న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నునావత్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు