కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

12-11-2026 | 04:53pm

జగిత్యాల,(విజయక్రాంతి): జగిత్యాల పట్టణానికి చెందిన 57 మంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం(Kalyana Lakshmi Scheme) కింద మంజూరైన రూ.57 లక్షల విలువైన చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్(MLA Dr Sanjay Kumar) పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. జగిత్యాల(Jagtial) పట్టణంలోని చింతకుంట చెరువు(Chintakunta Cheruvu), మోతె చెరువు అభివృద్ధికి ప్రభుత్వం ఒక్కో చెరువుకు రూ.3 కోట్ల చొప్పున మొత్తం రూ.6 కోట్ల నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. ఏడాది క్రితమే నిధులు మంజూరైనప్పటికీ వర్షాలు, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పనుల ప్రారంభంలో కొంత జాప్యం జరిగిందని వివరించారు.

జగిత్యాల నియోజకవర్గంతో పాటు పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కొందరు నాయకులు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చెరువుల పునరుజ్జీవన పనులు ప్రారంభం కానున్న తరుణంలో పనులు మొదలుకాలేదంటూ విమర్శలు చేయడం సరికాదన్నారు. తాము ప్రశ్నించడం వల్లే పనులు జరుగుతున్నాయని భావించడం వారి అపోహ మాత్రమేనని పేర్కొన్నారు.

చెరువుల పునరుజ్జీవన పథకంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 67 శాతం, కేంద్ర ప్రభుత్వ వాటా 33 శాతం ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రూపంలో 18 శాతం వసూలు చేస్తోందని వ్యాఖ్యానించారు.

జగిత్యాల నియోజకవర్గానికి నూతన పెన్షన్లు మంజూరయ్యాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా పెన్షన్లు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.

గత ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త పథకాలను కూడా ప్రజా ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, ఎమ్మార్వో రామ్మోహన్, బండ శంకర్, అడువాల లక్ష్మణ్, దుమాల రాజ్‌కుమార్, బీరం రాజేష్, రవీందర్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు