రోజులు గడుస్తున్నా.. మొదలుకాని వరి కొనుగోళ్లు

12-11-2026 | 04:48pm
  1. కొనుగోలు కేంద్రం ప్రారంభించి చేతులు దులుపుకున్నారా?
  2. ధాన్యం ఆరబెడుతూ రైతుల ఎదురుచూపులు.. తగ్గుతున్న బరువుతో ఆందోళన

భిక్కనూర్, నవంబర్ 12 (విజయ క్రాంతి): రైతుల సౌకర్యార్థం(convenience of farmers) ఏర్పాటు చేసిన ఐ కే పి  వరి కొనుగోలు కేంద్రాలు(IKP Paddy Procurement Centres) ప్రారంభోత్సవాలకే పరిమితమవుతున్నాయా? అన్న ప్రశ్నలు కంచర్ల గ్రామంలో వ్యక్తమవుతున్నాయి. బిక్కనూర్ మండలం కంచర్ల గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఇటీవల వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ, ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు మాత్రం మొదలుకాలేదు.

కేంద్రం ప్రారంభించి రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ఎందుకు చేపట్టడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రతిరోజూ కేంద్రం వద్దకు వెళ్లి సిబ్బందిని అడిగితే సాంకేతిక సమస్యలు, అలాట్‌మెంట్ సమస్యల వల్ల కొనుగోళ్లు ప్రారంభించలేకపోతున్నామని చెబుతున్నట్లు రైతులు వాపోతున్నారు.

ఇప్పటికే పలువురు రైతులు వరి కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోస్తూ కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఎండకు ధాన్యం ఆరిపోవడంతో బరువు తగ్గుతోందని, దీంతో తమకు రావాల్సిన డబ్బులు తగ్గి పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ధాన్యాన్ని జల్లెడ పట్టి, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా అమ్మకానికి సిద్ధం చేసినప్పటికీ కొనుగోలు చేసేవారు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

ధాన్యాన్ని సిద్ధం చేసినా కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో తమ ధాన్యాన్ని పట్టించుకునే నాథుడే లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ కొనుగోలు కేంద్రం చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం కారణంగా తమ కష్టమంతా వృథా అవుతోందని వాపోతున్నారు.

పంట పండించేందుకు నెలల తరబడి కష్టపడి, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు ఇప్పుడు ధాన్యం అమ్ముకునేందుకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు కొనుగోళ్లు మాత్రం ఎందుకు చేపట్టడం లేదని, సాంకేతిక, అలాట్‌మెంట్ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు.

ఏపీఎం వివరణ: ఈ విషయంపై విజయ క్రాంతి ఏపీఎం సాయిలు ను ఫోన్ ద్వారా సంప్రదించగా, సాంకేతిక సమస్యల కారణంగానే వరి కొనుగోళ్లు ప్రారంభించలేకపోతున్నామని తెలిపారు. సమస్యలు పరిష్కారం కాగానే ధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఈ సమస్యపై ఉన్నదా అధికారులతో మాట్లాడుతున్నట్లుగా తెలిపారు.

త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని దానికి రైతులు సహకరించాలని కోరారు. అయితే సాంకేతిక సమస్యలు ఎప్పటిలోగా పరిష్కారమవుతాయో స్పష్టత లేకపోవడంతో రైతుల్లో ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించి కొనుగోళ్లు ప్రారంభించాలని కంచర్ల గ్రామ రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు