ఆరు నెలల్లో జగ్గయ్యపల్లిలో 5జీ సేవలు

12-11-2026 | 04:57pm

టవర్ నిర్మాణానికి అనుమతి, స్థల పరిశీలన

మానకొండూరు, నవంబర్ 12 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లోని జగ్గయ్యపల్లి గ్రామస్తులు(Jaggayyapalli Village) కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న మొబైల్ నెట్వర్క్(Mobile network), ఇంటర్నెట్ సమస్యలు త్వరలోనే పరిష్కారం కానున్నాయి. సమస్య పరిష్కారానికి అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

దేశమంతా5జీతో పరుగెడుతుంటేజగ్గయ్యపల్లిగ్రామం 2జీ నెట్వర్క్ కు ఆమడదూరంలో ఉంది.కాల్ మాట్లాడుతున్నప్పుడు కట్ అవ్వటం, కనీస ఇంటర్నెట్ అవసరానికి 4జీ సేవలు లేకపోవటం పైన పలు సందర్భాలలో అనేక ఫిర్యాదులు సంబంధిత అధికారులకు చేసినప్పటికీ ఇన్నేళ్ళుగా ఎటువంటి పరిష్కారం లభించలేదు.

ప్రైవేట్ ఆపరేటర్లు చాలా సార్లు గ్రామానికి వచ్చి సిగ్నల్ సర్వే నిర్వహించారు. అయినా  సమస్యకు పరిష్కారం లభించలేదు. తాజాగా, ఇటీవల  గ్రామస్థులు బీఎస్ఎన్ఎల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటీ జనరల్ మేనేజర్ పొన్నం అజయ్ ను పలుమార్లు ప్రత్యేకంగా కలిసి టెక్నికల్ అంశాలను వివరించి, గ్రామంలో నెలకొన్న నెట్వర్క్ సమస్యను వారికి విన్నవించారు.

ఇదిలా ఉండగా, టవర్ ఏర్పాటుకు సంబంధించి పంచాయతీ, రెవిన్యూ, డీటీవో అనుమతులు  గ్రామస్తుల కృషి, ఐక్యతతో సాధించారు. బిఎస్ఎన్ఎల్ డిజిఎం, తో పాటు ఇతర ఉన్నతాధికారులు, సాంకేతిక బృంద సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వివరాలను సేకరించి మొబైల్ టవర్ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించారు.

గ్రామంలో అతి త్వరలోనే 2జీ, 3జీ, 4జీ సేవలతో కూడిన బీఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 5 జీ సేవలు మరో ఆరు నెలల్లో ప్రారంభమవుతాయని తెలిపి, ఏర్పాటు చేయబోయే టవరును కూడా 5జీ కి అప్ గ్రేడ్ చేస్తామని ప్రకటించారు.

టవరు నిర్మాణానికి సంబంధించిన స్థల పరిశీలన అనంతరం అధికారులు ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సేవలు గ్రామానికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజలు ఫైబర్ కనెక్షన్ కొరకు దరఖాస్తు చేసిన వెంటనే, త్వరితగతిన ఇంటర్నెట్ సేవలు అందిస్తామని అధికారులు వివరించారు.

మరిన్ని వార్తలు