ఆలేరులో 802 మందికి కొత్త ఆసరా పెన్షన్లు!
పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తాం.
కుల, మత, పార్టీలకు అతీతంగా అర్హులను గుర్తించాం – ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య..
ఆలేరు, నవంబర్ 16 (విజయక్రాంతి): 2022 నుంచి కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది, ఆలేరు మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఐదు రకాల కొత్త ఆసరా పెన్షన్ల(Aasara pensions)కు సంబంధించి మొత్తం 802 మందికి మంజూరు పత్రాలను దినేష్ గార్డెన్ ఆలేరులో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ కుల, మత, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ప్రజలు ఓటు వేసినా, వేయకపోయినా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని స్పష్టం చేశారు. పెన్షన్ల మంజూరులో ఎలాంటి అవినీతికి, మధ్యవర్తుల ప్రమేయానికి తావులేదని, లబ్ధిదారుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పారదర్శకంగా పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఆలేరు మండల పరిధిలో 502 మందికి, మున్సిపాలిటీ పరిధిలో 300 మందికి కొత్త పెన్షన్లు మంజూరయ్యాయని వెల్లడించారు. వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు ఈ పెన్షన్లు అందనున్నాయని పేర్కొన్నారు.
కొత్తగా మంజూరైన 502 పెన్షన్లతో ఆలేరు మండలంలో మొత్తం పెన్షన్ల సంఖ్య 3,575 నుంచి 4,077కు చేరగా, మున్సిపాలిటీలో 2,118 నుంచి 2,418కు పెరిగిందన్నారు. అలాగే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నామని, ఇళ్లు లేని వారు గ్రామ సర్పంచులు, కౌన్సిలర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆలేరు నియోజకవర్గాన్ని విద్య, వైద్యం, రవాణా, మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు.
పెన్షన్లు రాని అర్హులెవరైనా ఉంటే కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా వివరాలు అందించాలని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ అధికారి నాగిరెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జనగామ ఉపేందర్ రెడ్డి, బీజన బాలమణి, నీలం పద్మ, ఎడ్ల సతీష్ రెడ్డి, చిరుమర్తి రేణుక, సాగర్ రెడ్డి, ఎమ్ ఎ ఎజాజ్, గందమల్ల అశోక్, కుమారస్వామి, కంతి మధు, చింతకింది మురళి కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.