భూ రీసర్వే పకడ్బందీగా చేపట్టాలి
అదనపు కలెక్టర్ అశోక్ కుమార్
భూపాలపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో కొనసాగుతున్న భూ రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. క్షేత్రస్థాయి సర్వే, డేటా నమోదు ప్రక్రియను సమాంతరంగా పూర్తి చేయాలని సూచించారు. రీసర్వే ప్రారంభానికి ముందు గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని, పట్టాదారులకు ముందుగానే సమాచారం అందించాలని ఆదేశించారు.
భూ రికార్డులు, క్షేత్రస్థాయి కొలతల్లో తేడాలు ఉంటే కారణాలను స్పష్టంగా నమోదు చేయాలన్నారు. రీసర్వే అనంతరం గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి రైతుల అభ్యంతరాలను చట్టబద్ధ ఆధారాలతో పరిష్కరించాలని సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ సూచించారు. తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వసంత కుమారి, ఏడీ కుసుమ కుమారి, డిప్యూటీ డైరెక్టర్ సమీనా బేగం, జోనల్ అధికారులు లావణ్య, కేశవులు, తహసీల్దార్లు, రెవెన్యూ, సర్వే శాఖల సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.