విజయవంతంగా చెకుముకి జిల్లా స్థాయి పోటీలు
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) గర్మిళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో(Garmilla Zilla Parishad High School) జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్(Chekumuki Science) సంబరాల్లో భాగంగా శనివారం జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీ పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనీ వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వీరే...
ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం విభాగంలో జన్నారం మండలం జడ్పీహెచ్ఎస్ కిష్టాపూర్ పాఠశాల జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ఇదే పాఠశాల నుంచి 8వ తరగతి విద్యార్థిని శ్రీహిత , 9వ తరగతి విద్యార్థిని ఉదయ్, 10వ తరగతి విద్యార్థిని అనన్య రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల విభాగంలో ఎంజేపీ హైటెక్ సిటీ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని శన్విత, నైన్త్ క్లాస్ ఆర్ ప్రిన్సి, టెన్త్ క్లాస్ జె వైశాలిలు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ప్రభుత్వ తెలుగు మీడియం విభాగంలో భీమారం మండలం జడ్పీహెచ్ఎస్ పాఠశాల జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ఈ పాఠశాల నుంచి 8వ తరగతి విద్యార్థిని పి. కీర్తన, 9వ తరగతి విద్యార్థి శ్రీ, 10వ తరగతి విద్యార్థి జి. చరణ్ తేజ ఎంపికయ్యారు. ప్రైవేట్ పాఠశాల విభాగంలో నస్పూర్ మండలం ఆక్స్ఫర్డ్ క్రియేటివిటీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచింది. 8వ తరగతి బి అక్షిత్ వర్మ, 9వ తరగతి ఏ సాయిశ్రీ, 10వ తరగతి వి సౌమ్య చంద్రికలు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కన్వీనర్ కిష్టయ్య, ముఖ్య అతిథి హాజరైన సబ్ ఇన్స్పెక్టర్ ఏ అంజనేయులుతో కలిసి మాట్లాడారు. విద్యార్థులలో దాగి ఉన్న శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అలాగే మూఢ నమ్మకాలను నిర్మూలించడానికి జన విజ్ఞాన వేదిక ఎంతో ప్రయత్నిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గర్మిళ్ల హైస్కూల్ హెడ్మాస్టర్ నాగరాజ వర్మ, డి దేవన్న, కె రాజన్న, జి రాజేశం, రాజేష్, తిరుపతి వివిధ మండలాల నుంచి వచ్చిన సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.