సాలూరలో నాలుగు దుకాణాల వేలం పూర్తీ
సాలూర, నవంబర్ 28(విజయక్రాంతి): సాలూర మండల(Salur Mandal) కేంద్రంలోని గ్రామ పంచాయతీకి(Village Panchayat) చెందిన నాలుగు దుకాణాలకు శనివారం బహిరంగ వేలంపాట నిర్వహించారు. గ్రామ ప్రజల సమక్షంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ పర్యవేక్షణలో ఈ వేలంపాట ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు(Candidates) ముందుగా రూ.25 వేల చొప్పున డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొన్నారు. ఈ వేలంపాటలో మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీపడగా, అత్యధిక ధరలు కోట్ చేసిన నలుగురు అభ్యర్థులు దుకాణాలను దక్కించుకున్నారు.
మొదటి దుకాణాన్ని మైదాపు నాగరాజు రూ.4 వేలకు, రెండో దుకాణాన్ని ముట్టెన్ ప్రకాష్ రూ.4వేల 700లకు, మూడో దుకాణాన్ని కన్నె రాజు రూ.4వేల 900కు, నాలుగో దుకాణాన్ని ఎం.కృష్ణ రూ.4 వేల 800లకు సొంతం చేసుకున్నారు. గ్రామ పంచాయతీ ఆదాయాన్ని పెంపొందించడంతో పాటు వేలంపాటలో పారదర్శకత పాటించేందుకు బహిరంగ వేలం నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ సోక్కం లావణ్య రవి తెలిపారు. దుకాణాలు దక్కించుకున్న వారితో రెండేళ్ల కాలపరిమితికి అగ్రిమెంట్ పత్రాలు రాసుకొని అప్పగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.