రైస్ మిల్లులో అగ్నిప్రమాదం
రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం
సుల్తానాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలోని(Bhupathipur Village) సింధు రైస్ మిల్లులో(Sindhu Rice Mill) శనివారం అగ్ని ప్రమాదం(Fire accident) చోటుచేసుకుంది. దీంతో మిల్లులోని ధాన్యం కొంత అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు మిల్లు యజమాని అల్లెంకి కరుణాకర్ తెలిపారు, ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను ఆర్పివేసి భారీ ఆస్తి నష్టం జరగకుండా నియంత్రించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని మిల్లు యజమాని తెలిపారు.
సుల్తానాబాద్‌లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి
సుల్తానాబాద్ మండలం పరిశ్రమలకు కేంద్రంగా మారిందని, వేలాది మంది పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. పలు సందర్భాల్లో పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు మండలాలకు ముఖ్య కూడలిగా ఉన్న సుల్తానాబాద్‌లో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో పెద్దపల్లి నుంచి అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపు భారీగా ఆస్తి నష్టం జరుగుతోందని చెబుతున్నారు.
కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, ఎలిగేడు, సుల్తానాబాద్ మండలాలకు ముఖ్య కూడలిగా ఉన్న సుల్తానాబాద్‌లో వెంటనే అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని పలువురు మండల ప్రజలు కోరుతున్నారు. ఫైర్ స్టేషన్ అందుబాటులో ఉంటే అగ్ని ప్రమాదాల వల్ల జరిగే నష్టాన్ని కొంతవరకు తగ్గించవచ్చని అభిప్రాయపడుతున్నారు.