17న జిల్లా స్థాయి యువజనోత్సవాలు
భూపాలపల్లి,(విజయక్రాంతి): యువతలోని సృజనాత్మకత, కళా నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను వెలికితీసేందుకు జిల్లా స్థాయి యువజనోత్సవాలు(District Youth Festival), వికసిత్ భారత్ యువ నాయకుల సంభాషణ కార్యక్రమాన్ని ఈ నెల 17న నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) తెలిపారు. భూపాలపల్లిలోని ఎల్లందు క్లబ్ హాల్లో ఉదయం 9 గంటల నుంచి పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు.
జానపద నృత్యం, జానపద గీతాలు, చిత్రలేఖనం, మొబైల్ ఫొటోగ్రఫీ, కథా రచన విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 15 నుంచి 29 ఏళ్ల యువతీ యువకులు పాల్గొనవచ్చని, మై భారత్ పోర్టల్లో ముందుగా నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. పూర్తి వివరాలకు సి.హెచ్. రఘు, జిల్లా యువజన, క్రీడల అధికారి, భూపాలపల్లి ఐడిఓసి కార్యాలయం, సెల్: 9618011096. సంప్రదించాలన్నారు.