విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
గ్రీన్వుడ్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు.
మహదేవ్పూర్, నవంబర్ 14. (విజయక్రాంతి) : మహదేవ్పూర్ మండల(Mahadevpur Mandal) కేంద్రంలోని గ్రీన్వుడ్ కాన్సెప్ట్ స్కూల్లో(Greenwood Concept School) జవహర్ లాల్ నెహ్రూ జయంతి(Jawaharlal Nehru's Birth Anniversary) సందర్భంగా బాలల దినోత్సవంలో భాగంగా స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తూ, తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చీర్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బాలల దినోత్సవానికి భారతదేశంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని, పిల్లల హక్కులు, వారి విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు గురించి సవాళ్లను గుర్తించి, వారికి మంచి ప్రగతిని అందించాలనే ఆలోచనను ముందుకు తీసుకెళ్లడమే ఈ బాలల దినోత్సవ ముఖ్య ఉద్దేశమన్నారు.
ఒక వ్యవస్థ యొక్క మార్గదర్శకాలు, విధి విధానాలు, పనితీరు అర్థం చేసుకోవడానికి మరియు భవిష్యత్తులో ఒక వ్యవస్థను నడిపించేటువంటి విధానాన్ని అవగతం చేసుకోవడానికి స్వయం పరిపాలన దినోత్సవం ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించడం ద్వారా వారికి బోధనా విధానము, తరగతి గది నిర్వహణ, పాఠశాల నిర్వహణ లాంటి విషయాలపై అవగాహన వచ్చి ఒక వ్యవస్థను నడిపించడానికి దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
అనంతరం ఉత్తమంగా బోధన చేసిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేశారు.కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చీర్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు చీర్ల శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ ఆకుతోట రాజ్ కుమార్, మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.