మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి
యువత పెద్ద సంఖ్యలో హాజు కావాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి, అక్టోబర్ 07 (విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 9న భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గార్డెన్స్‌లో మెగా జాబ్ మేళా(Mega job fair) నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) తెలిపారు. బుధవారం పుష్ప గార్డెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి అధికారులతో జాబ్ మేళా ఏర్పాట్లను సమీక్షించారు.
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయని ఎమ్మెల్యే తెలిపారు. వివిధ విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలు కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థుల సౌకర్యార్థం మొత్తం 15 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం ఉచితంగా ఆటోలు, టాటా ఏస్ వాహనాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సర్పంచులు, ఎంపీడీవోలు సమన్వయంతో ఉదయాన్నే టిఫిన్ అందించి అభ్యర్థులను జాబ్ మేళా ప్రాంగణానికి తరలించాలని సూచించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, ఐటీఐ, పాలిటెక్నిక్, బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ, డీఫార్మసీ తదితర విద్యార్హతలు కలిగిన యువత పాల్గొనవచ్చన్నారు. అభ్యర్థులు విద్యార్హతల ధ్రువపత్రాలతో ఉదయం 7 గంటలకు పుష్ప గార్డెన్స్‌కు చేరుకోవాలని సూచించారు.
గతంలో నిర్వహించిన జాబ్ మేళాలో 2,770 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించాయని, ఈసారి మరింత విస్తృత స్థాయిలో అవకాశాలు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జెన్‌కో సీఈ శ్రీ ప్రకాష్, సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.