ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధే లక్ష్యం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
గణపురం,(విజయ క్రాంతి): ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు(MLA Gandra Satyanaarayana Rao ) అన్నారు. శనివారం గణపురం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం(Indiramma Family Life Insurance Scheme)పై ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడంతో పాటు మైలారం గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్ల పట్టాలను అందజేశారు.
మైలారం, గాంధీనగర్, కరకపల్లి, లక్ష్మారెడ్డిపల్లి గ్రామాల్లో అంగన్వాడీ, మహిళా సమైక్య, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, చేయూత పింఛన్లతో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడంతో పాటు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచులు ఇంజపెల్లి శ్రీనివాస్, సమ్మయ్య నాయక్ ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.