కేజీబీవీలను తనిఖీ చేసిన జీసీడీవో విజయలక్ష్మి
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలోని(Mahabubabad District) గార్ల, డోర్నకల్, బయ్యారం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను (కేజీబీవీ) జీసీడీవో విజయలక్ష్మి(GCDO Vijayalakshmi) తనిఖీ చేశారు. రానున్న పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలని, విద్యార్థుల విద్యా ప్రగతిపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు.ఈ సందర్భంగా ఆయా కేజీబీవీల్లో విద్యార్థులకు అందిస్తున్న విద్యా బోధన, పాఠ్యాంశాల పూర్తిస్థాయి అమలు, పరీక్షల సన్నద్ధత తదితర అంశాలను పరిశీలించారు.
నిర్ణీత విద్యా ప్రణాళిక ప్రకారం సిలబస్‌ను పూర్తిచేసి, విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించడంతో పాటు తరగతుల వారీగా పునశ్చరణ నిర్వహించాలని తెలిపారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంపొందించే విధంగా బోధన సాగించాలని, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.కేజీబీవీల్లో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి, పాఠశాల నిర్వహణకు సంబంధించిన రిజిస్టర్లు, విద్యార్థుల హాజరు, విద్యా సంబంధిత రికార్డులు, ఇతర నిర్వహణ పత్రాలను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.
పాఠశాల పరిపాలనలో పారదర్శకత, క్రమశిక్షణ పాటిస్తూ అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. విద్యార్థులకు అందించే వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ స్టోర్ గది, వంటగది (కిచెన్), తరగతి గదులను పరిశీలించారు. స్టోర్ గదిలో నిల్వ ఉంచిన వస్తువులు, సరుకులను సక్రమంగా నిర్వహించాలని, వంటగదిలో పరిశుభ్రత పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని సూచించారు.
వంటగది, ఆహార పదార్థాల నిల్వ ప్రదేశాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యార్థుల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.తరగతి గదులను పరిశీలిస్తూ విద్యార్థులకు అనుకూలమైన బోధనా వాతావరణం కల్పించాలని, గదులు శుభ్రంగా, క్రమబద్ధంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. కేజీబీవీలలో విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యం, పరిశుభ్రత, క్రమశిక్షణ, భద్రత వంటి అంశాల్లో తగిన మార్గదర్శకత్వం అందించాలని తెలిపారు.