ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ తోట సాయిప్రసాద్ కు ‘ఉత్కృష్ట సేవా పతకం’

10-11-2026 | 06:11pm

25 ఏళ్ల మచ్చలేని సేవకు కేంద్ర హోం శాఖ గుర్తింపు

ఎల్లారెడ్డి, నవంబర్ 10 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రదానం చేసే ప్రతిష్టాత్మక ‘ఉత్కృష్ట సేవా పతకం’కు తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ తోట సాయిప్రసాద్(Telangana Head Constable Sai Prasad) (హెచ్.సి. 4564) ఎంపికయ్యారు.

2000 బ్యాచ్ కు చెందిన సాయిప్రసాద్ గత 25 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో మచ్చలేని సేవలందిస్తున్నారు. విధి నిర్వహణలో చూపిన అంకితభావం, నిజాయితీ, క్రమశిక్షణకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన కీర్తిశేషులు తోట పోచయ్య (ఆర్టీసీ కండక్టర్), తోట సావిత్రి దంపతులకు సాయిప్రసాద్ రెండవ సంతానం. వారి పెద్ద కుమార్తె భాగ్యలక్ష్మి ప్రైవేట్ టీచర్ గా, చిన్న కుమారుడు తోట లింగమూర్తి ఏసీబీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. సాయిప్రసాద్ చదువుతూనే 2000 సంవత్సరంలో పోలీస్ శాఖకు ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో పోలీసు శిక్షణ పూర్తి చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ లో మొదటి పోస్టింగ్ తో తన సేవా యాత్రను ప్రారంభించారు.

అనంతరం సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ లో రెండవ పోస్టింగ్, గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో మూడవ పోస్టింగ్, ట్రాన్స్ కో విజిలెన్స్ లో నాల్గవ పోస్టింగ్ లో విధులు నిర్వర్తించి, ప్రస్తుతం ఐదవ పోస్టింగ్ గా ఇంటెలిజెన్స్ విభాగంలో సేవలందిస్తున్నారు. ఆయన సతీమణి తోట రేణుక ప్రసాద్ రోడ్లు-భవనాల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా మెదక్ జిల్లా గజ్వేల్ లో విధులు నిర్వహిస్తున్నారు.

ప్రతి పోస్టింగ్ లోనూ నిజాయితీ, క్రమశిక్షణ, ప్రజల పట్ల సేవా భావంతో పనిచేసినందుకు ఆయనకు ఉన్నతాధికారులు, ప్రజల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 2023లో రాష్ట్ర పోలీస్ శాఖ సేవా పతకాన్ని కూడా అందుకున్నారు.

దేశవ్యాప్తంగా రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, హోంగార్డులు, సివిల్ డిఫెన్స్ విభాగాల్లో చేసిన అత్యుత్తమ సేవలకు గాను ఈ పతకాన్ని ప్రదానం చేస్తారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందని సాయిప్రసాద్ తెలిపారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, తోటి సిబ్బంది, 2000 బ్యాచ్ మిత్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆశీర్వదించారు.

మరిన్ని వార్తలు