నీటి సంరక్షణపై చిన్నారుల అవగాహన ర్యాలీ
నీటిని వృథా చేయొద్దంటూ ప్రజలకు విద్యార్థుల సందేశం
రామచంద్రపురం నవంబర్ 10: నీరే జీవనాధారం.. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశంతో బీహెచ్ఈఎల్ న్యూ ఎంఐజీ కాలనీలో చిన్నారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎస్పీఎస్ – సంసిద్ధి అప్పర్ ప్రైమరీ స్కూల్(SPS - Samsiddhi Upper Primary School), విద్యుత్ కిడ్జ్ ప్రీ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు నీటి పొదుపును సూచించే ప్లకార్డులు చేతబట్టి కాలనీలో ర్యాలీ నిర్వహించారు.
నీరు అమూల్యమైన సహజ వనరని, ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించుకోవాలని నినాదాలు చేశారు.కుళాయిలను అవసరం లేకుండా తెరిచి ఉంచకూడదని, నీటిని వృథా చేయకుండా జాగ్రత్తలు పాటించాలని స్థానికులకు అవగాహన కల్పించారు.ప్రస్తుతం పెరుగుతున్న నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కార్యక్రమ నిర్వాహకులు సూచించారు.
వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవడం, భూగర్భ జలాలను కాపాడుకోవడం, ఇంటి వద్ద నీటిని పొదుపుగా వినియోగించడం వంటి అలవాట్లను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. చిన్న వయస్సు నుంచే విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ, నీటి పొదుపుపై బాధ్యతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులు ఎంతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొని ప్రజలకు నీటి సంరక్షణ ప్రాధాన్యతను వివరించడం స్థానికులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వినయ్,సోషల్ యాక్టివిటీ అరుణ, త్రివేన్ కుమార్, ప్రవీణ్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.