కరువు కోరల్లో మునుగోడు
- కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి
వరి రైతులకు రూ.30 వేలు.. వాణిజ్య పంటలకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలి
- కౌలు రైతులకూ నేరుగా నష్టపరిహారం చెల్లించాలి
- ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
మునుగోడు, నవంబర్ 10 (విజయక్రాంతి): కరువు కోరల్లో ఉన్న మునుగోడును(Munugode), కరువు జాతీయ విపత్తుగా(National Disaster) ప్రకటించి రైతులను(Farmers') ఆదుకోవాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం(MLC Nellikanti Satyam) అన్నారు. సీపీఐ(CPI) ఆధ్వర్యంలో మంగళవారం మునుగోడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి మహాధర్నా నిర్వహించి మాట్లాడారు. వర్షాభావ పరిస్థితులు.. ఎల్‌నినో ప్రభావం.. వెరసి అన్నదాతకు తీవ్ర నష్టం వాటిల్లింది. పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొంది. గతంలో ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చేది.
ఈ ఏడాది ఒకటి, రెండు క్వింటాళ్లకే పరిమితమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి సాగు చేసిన రైతులూ తీవ్రంగా నష్టపోయారని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరువు పరిస్థితులను గుర్తించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. వరి రైతులకు ఎకరాకు రూ.30 వేలు, పత్తి సహా ఇతర వాణిజ్య పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భూములను కౌలుకు తీసుకొని సాగు చేసిన రైతులకూ నేరుగా నష్టపరిహారం చెల్లించాలన్నారు. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు.అనంతరం రైతుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా నాయకుడు గురుజ రామచంద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బోలుగూరి నరసింహ, సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, జిల్లా కౌన్సిల్ సభ్యులు సురిగి చలపతి, బిలాలు, చల్మెడ సర్పంచి బండమీది యాదయ్య, మాజీ జెడ్పీటీసీ గోస్కొండ లింగయ్య, ఈదులకంటి కైలాస్, దుబ్బ వెంకన్న, ఉదయ్ కుమార్, కట్ట దశరథ, టి.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.