క్రీడలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగసాగర్
భూపాలపల్లి,(విజయక్రాంతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగసాగర్, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆకాంక్షించారు. ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో మేడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గురువారం డివిజన్ స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీల్లో సుమారు 200 మంది బాలబాలికలు పాల్గొంటున్నారు. గురువారం బాలికలకు, శుక్రవారం బాలురకు వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, జట్టు స్ఫూర్తితో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏటీడీఓ శివకృష్ణ, ఎస్సై శ్రీనివాస్, సర్పంచ్ గడవేని పవిత్ర, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.