ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పంటల మార్పిడే మేలు!

12-11-2026 | 05:00pm

వరి సాగుకు బదులు ఆరుతడి పంటల వైపు రైతులు దృష్టి సారించాలి నీటి పొదుపు, నేల ఆరోగ్య పరిరక్షణపై అధికారుల అవగాహన

హుజురాబాద్,నవంబర్12: (విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావంతో(El Niño effect) భవిష్యత్తులో సాగునీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారులు(Agriculture Department officials) సూచించారు. నీటి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకుంటూ తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

చెల్పూర్ గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ వంతడుపుల కస్తూరి అధ్యక్షతన వ్యవసాయ శాఖ, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 'ఖేత్ బచావో అభియాన్' కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త మహేష్ మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వరికి బదులుగా పొద్దుతిరుగుడు, శనగ, మినుములు, కుసుమ వంటి పప్పు దినుసులు, నూనె గింజల పంటలు సాగు చేయాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి పచ్చిరొట్ట ఎరువులు, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని తెలిపారు.

హుజురాబాద్ ఏడీఏ జి. సునీత మాట్లాడుతూ రైతులు యూరియా, డీఏపీ ఎరువులను అవసరానికి అనుగుణంగా సమతుల్య పద్ధతిలో వినియోగించాలని సూచించారు. నానో యూరియా, నానో డీఏపీ, నానో పొటాష్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, సుస్థిర పోషక యాజమాన్య పద్ధతులు, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు.

ఉద్యానవన శాఖ అధికారి మధులిక మాట్లాడుతూ ఆయిల్‌పామ్ సాగు, ఉల్లి పంట యాజమాన్యం, మార్కెటింగ్ అవకాశాలు, ప్రభుత్వం అందించే సబ్సిడీల గురించి వివరించారు. కూరగాయల సాగులో పాటించాల్సిన మెళకువలను తెలియజేశారు. డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలు అవసరమైన రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.

గ్రామ సర్పంచ్ వంతడుపుల కస్తూరి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో రైతులు నీటిని పొదుపుగా వినియోగించాలని, ఇంకుడు గుంతలు, వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్‌పాండ్లు నిర్మించుకోవాలని సూచించారు.

మండల వ్యవసాయ అధికారి భూమిరెడ్డి మాట్లాడుతూ మండలంలోని భూగర్భ జలాల పరిస్థితిని రైతులకు వివరించారు. పంట మార్పిడిలో భాగంగా సరుగుడు, సుబాబుల్, జామాయిల్, ఆయిల్‌పామ్ పంటల ఆవశ్యకతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నేరెళ్ల శ్రీనివాస్, వార్డు సభ్యులు, ఏఈఓలు రాంప్రసాద్, సతీశ్, అనూష, పీఏసీఎస్ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు