నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే నియంత్రించాలి

21-11-2026 | 05:23pm

 * రేషన్ షాపుల ద్వారా 13 రకాల సరుకులను పంపిణీ చేయాలి

 * కలెక్టరేట్ ఎదుట పిఓడబ్ల్యు ధర్నా.. జాయింట్ కలెక్టర్‌కు వినతి

సూర్యాపేట, నవంబర్ 21 (విజయక్రాంతి) : రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరుకులు(Essential commodities), కూరగాయలు, ఉల్లిగడ్డల ధరలను తక్షణమే నియంత్రించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 13 రకాల నిత్యావసర సరుకులను అందించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం(Progressive Womens Organization) (పిఓడబ్ల్యు) సూర్యాపేట జిల్లా(Suryapet District) కార్యవర్గం ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ హరిసింగ్‌కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మేకల రాజేశ్వరి, కంచర్ల నరసక్క మాట్లాడుతూ.. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి కృత్రిమ కొరత సృష్టిస్తూ ప్రజలను దోచుకుంటున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో వలసల నివారణకు ఉపాధి హామీ కూలీలకు అదనపు పనిదినాలు కల్పించాలని, కార్పొరేట్ రాయితీలు రద్దు చేసి ఆ నిధులను ప్రభుత్వ విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కేటాయించాలని కోరారు.

అలాగే అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజనం, కేజీబీవీ, మున్సిపల్ తదితర ప్రభుత్వ రంగ మహిళా కార్మికులకు సమాన పనికి సమాన వేతనంతో పాటు కనీస వేతనాలు పెంచాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు అలుగుబెల్లి వాణి, సహాయ కార్యదర్శి రామలింగమ్మ, నాయకురాలు సైదమ్మ, మంగ, ఎస్కే కౌరు, నల్గొండ రమ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు