ప్రజాస్వామ్య విలువలు, ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి

21-11-2026 | 05:37pm

సాలూర, నవంబర్ 21(విజయక్రాంతి): నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, విద్యార్థులు చిన్ననాటి నుండే ప్రజాస్వామ్య విలువలు, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సాలూర మండల విద్యాశాఖ(Salur Mandal Education Department) అధికారిణి  రాజీ మంజుష అన్నారు. సాలూర ​ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన 'మాక్‌ పార్లమెంట్‌(Mock Parliament)' కార్యక్రమం  ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రధానమంత్రి, స్పీకర్, మంత్రులు, ప్రతిపక్ష నాయకులుగా వ్యవహరిస్తూ సభా కార్యక్రమాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.​

ప్రజారోగ్యం, ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులు, విద్యా ప్రమాణాలు, పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఎల్‌నినో ప్రభావం(impact of ElNino) వంటి ప్రజా సమస్యలపై ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికార పక్ష మంత్రులు సమర్థవంతంగా సమాధానాలు ఇస్తూ సభను రక్తికట్టించారు. పుస్తకాలకే పరిమితం కాకుండా పార్లమెంటరీ వ్యవస్థ పనితీరును విద్యార్థులకు ప్రత్యక్షంగా పరిచయం చేయడంతో పాటు రాజ్యాంగ విలువల పెంపు, పౌర బాధ్యత, రాజకీయ చైతన్యం, నాయకత్వ లక్షణాలు, చర్చా నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఎంఈఓ​ విద్యార్థుల ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు దండు రాజ్‌కుమార్, బగారే లక్ష్మి సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్, ఉపాధ్యాయులు గంధం సాయిలు, సంగీత్ రావ్, అబ్బయ్య, జోత్స్న, విజయలక్ష్మి, స్వర్ణలత, మేడి రవి, అక్షయ్ కుమార్ జాదవ్, అంజన, విక్రమ్, శ్రీకాంత్ రెడ్డి, యశశ్రీ, సునీత, హనుమాన్లు తదితరులతో పాటు విద్యార్థిని విద్యార్థులు​ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు