డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం..
- మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ పిలుపు
- సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
- మోసపోతే వెంటనే 1930 కి కాల్ చేయాలి
- బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీసుల ప్రథమ కర్తవ్యం
- కామారెడ్డి సమీక్షలో డీజీపీ దిశానిర్దేశం.
- నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం.. నేడు శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం.
- ఇతర రాష్ట్రాల గ్యాంగ్ లు, ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణ కొరకు ఆపరేషన్ కవాచ్ ఏర్పాటు-
- కామరెడ్డి పోలీసుల పనితీరు భేష్
- కామారెడ్డి పోలీసుల సమష్టి కృషికి డీజీపీ అభినందనలు..
- ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్ష
- తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి. ఆనంద్
కామారెడ్డి, నవంబర్ 27 (విజయక్రాంతి): డ్రగ్స్ రహిత రాష్ట్రమే(Drug-free state) లక్ష్యంగా మాదక ద్రవ్యాలపై(Drugs) ఉక్కు పాదం మోపాలని డిజిపి సి వి ఆనంద్(DGP C. V. Anand) పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలో(Kamareddy District) ఆయన పర్యటించారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్న డీజీపీ కి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పుష్పగుచ్ఛాలు అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన డీజీపీ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం
జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, డీఎస్పీలతో డీజీపీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా పోలీస్ శాఖ పనితీరు, స్థితిగతులను వివరించారు. ముఖ్యంగా శాంతిభద్రతల నిర్వహణ, ముఖ్యమైన కేసుల పురోగతి, 'ఆపరేషన్ కవాచ్' ప్రత్యేక చర్యలు, ప్రజలకు అందిస్తున్న పారదర్శక పోలీస్ సేవలు, జిల్లా ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కార మార్గాలను సమగ్రంగా తెలియజేశారు. అనంతరం ఎస్‌సీఆర్‌బీ (SCRB), సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈగల్ టీమ్ అధికారులు తమ తమ విభాగాలలో జిల్లా పనితీరును క్లుప్తంగా వివరించారు.
ఈ సందర్భంగా డీజీపీ సి.వి. ఆనంద్, మాట్లాడుతూ సుమారు 20 సంవత్సరాల తర్వాత మళ్లీ కామారెడ్డి జిల్లాకు రావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గతంలో తాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎస్ పి గా పనిచేసిన సమయంలో ఉన్న పరిస్థితులకు, ప్రస్తుత పరిస్థితులకు ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. గతంలో నక్సలిజం, మావోయిస్టుల సంచారం, క్లేమోర్ మైన్లు, ల్యాండ్ మైన్ల భయం వంటి సవాళ్లు ఉండేవని, నేడు ప్రభుత్వ పటిష్టమైన చర్యలు, పోలీసుల సమష్టి కృషితో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించగలిగామని తెలిపారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, నాయకత్వంలో కామారెడ్డి జిల్లా పోలీస్ బృందం ఆపరేషన్ కవచ్ వంటి పటిష్ట చర్యల ద్వార ఇతర రాష్ట్రాల గ్యాంగ్ లు, ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణ చేస్తున్నారు అని అన్నారు.
సైబర్ నేరాల నియంత్రణలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవడం అభినందనీయమని డీజీపీ ప్రశంసించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై చర్యలు, నేరస్తులు, హిస్టరీ షీటర్లపై నిరంతర నిఘా ఉంచుతూ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఆస్తి సంబంధిత నేరాలను సమర్థవంతంగా అరికడుతున్న అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో జాతీయ రహదారులు అధికంగా ఉన్నందున రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆపరేషన్ కవచ్ చెక్‌పోస్టుల ద్వారా అంతర్రాష్ట్ర ముఠాలను అడ్డుకోవడంతో పాటు గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టే చర్యలను నిరంతరం కొనసాగించాలని సూచించారు.
మాదకద్రవ్యాల సమస్య దేశ భవిష్యత్తుకు పెను సవాలుగా మారిందని, యువతను ఈ మహమ్మారి నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డీజీపీ గారు అన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని పేర్కొంటూ 2029 డిసెంబర్ 31 నాటికి దేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో సమన్వయం చేసుకుంటూ మాదకద్రవ్యాల సరఫరా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, విద్యార్థులు, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.
సైబర్ నేరాల నియంత్రణలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందని డీజీపీ తెలిపారు. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న సొమ్మును సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టులు, ట్రేడింగ్ మోసాల ద్వారా దోచుకుంటున్నారని, వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాల్లో ప్రత్యేక సైబర్ యూనిట్ల ద్వారా బాధితులకు వేగంగా న్యాయం అందిస్తున్నామని, సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు …