ముందులితాండాలో భూభారతి భూ సర్వే
మహమ్మదాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): మండల పరిధిలోని ముందులితాండా గ్రామపంచాయతీలో(Mundulitanda Grama Panchayat) భూభారతి పథకంలో(Bhu-Bharati Scheme) భాగంగా భూ సర్వే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అంజ్యానాయక్ మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రజలకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పింఛన్లు(Pensions) మంజూరు చేసినట్లు తెలిపారు.
రైతులు తమ భూముల హక్కులను కాపాడుకునేందుకు ప్రభుత్వం భూభారతి భూ సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని డీఆర్ఓ నిర్మల వివరించారు. ప్రతి మండలంలో సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు గ్రామాలకు వచ్చి భూములను సర్వే చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ గ్రామమైన లింగాయపల్లికి చెందిన రైతులందరూ సర్వేలో పాల్గొని తమ భూములను సర్వే చేయించుకోవాలని, భూ రికార్డుల్లో ఏవైనా తప్పులు ఉంటే సరిచేయించుకోవాలని సర్పంచ్ అంజ్యానాయక్, డీఆర్ఓ నిర్మల, తహసీల్దార్ విద్యాసాగర్ సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విద్యాసాగర్, సర్వేయర్ గోపాల్, గ్రామ కార్యదర్శి ఉమాదేవి, జీపీఓ వెంకటయ్య, వార్డు సభ్యులు అంజ్యానాయక్, లలితాబాయి, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.