సకాలంలో వైద్యం అందితే చందు ప్రాణాలు దక్కేవా?

27-11-2026 | 11:45pm

సుప్రీమ్ పరిశ్రమలో అస్వస్థతకు గురై కాంట్రాక్ట్ కార్మికుడి మృతి

అంబులెన్స్ ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం జరిగిందని కుటుంబ సభ్యుల ఆరోపణ..

న్యాయం కోసం పరిశ్రమ ఎదుట ఆందోళన

జడ్చర్ల, నవంబర్ 27: జడ్చర్ల మండలం(Jadcherla Mandal) పోలేపల్లి సెజ్‌లోని సుప్రీమ్ పరిశ్రమలో(Supreme Industries) కాంట్రాక్ట్ కార్మికుడిగా(Contract worker) పనిచేస్తున్న మాచారం గ్రామానికి చెందిన చందు (35) శుక్రవారం విధులకు హాజరైన కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చందు అస్వస్థతకు గురైన సమయంలో పరిశ్రమ యాజమాన్యం వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేయలేదని, తోటి కార్మికుల సహాయంతో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సకాలంలో అత్యవసర వైద్య సహాయం అందించి ఉంటే తమ కుటుంబ సభ్యుడి ప్రాణాలు దక్కేవని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మికుల ఆరోగ్య భద్రత, అత్యవసర వైద్య సదుపాయాలపై పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు సుప్రీమ్ పరిశ్రమ ఎదుట ఆందోళనకు దిగారు. చందు మృతిపై సమగ్ర విచారణ జరిపి, ఘటనకు గల కారణాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించడం యాజమాన్యాల బాధ్యత అని, చందు మృతి ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు