అభివృద్ధి పనులపై దృష్టి సారించండి
-జెడ్పి సీఈఓ చందర్ నాయక్
జుక్కల్, నవంబర్ 3 (విజయక్రాంతి): జుక్కల్ మండల(Jukkal Mandal) పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను సమావేశంలో వెల్లడించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, విద్యుత్ సమస్యలు తదితర అంశాలపై సమీక్షించారు. గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను అధికారులు ప్రత్యేకంగా చర్చించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలు పంచుకున్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో సూచించారు. అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యం లేకుండా, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చర్చించారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమస్యలపై సత్వరమే స్పందించి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రతి శాఖ అధికారిపై ఉందని సమావేశంలో ప్రస్తావించారు. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని, క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జడ్పీ సీఈవో చందర్ నాయక్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో రాము, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.