బియ్యం దుకాణాల్లో తనిఖీలు
కామారెడ్డి, నవంబర్ 2 (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలో బియ్యం ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, ధరల పర్యవేక్షణ కమిటీ(Price Monitoring Committee) సమావేశంలో జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, తూనికలు కొలతల శాఖ(Department of Weights and Measures) అధికారితో కలిసి మంగళవారం బియ్యం దుకాణాలను తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల సందర్భంగా బియ్యం ప్యాకెట్లపై తయారీదారు చిరునామా, వినియోగదారుల సేవా కేంద్రం ఫోన్ నంబరు ముద్రించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి న్యాయ కొలతల శాస్త్రం (ప్యాకేజ్డ్ కమోడిటీస్) నిబంధనలు–2011లోని 6(1)(ఎ), 6(2) నిబంధనల ప్రకారం రెండు వ్యాపార సంస్థలు జై సంతోషి మాత కిరాణం, లక్ష్మీ సాయి కిరానా దుకాణాలపై కేసును నమోదు చేశారు.
ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలోని హోల్సేల్, రిటైల్ బియ్యం వ్యాపారులు ప్రభుత్వం, సంబంధిత అధికారులు నిర్ణయించిన గరిష్ట ధరలకు మించి బియ్యం విక్రయించరాదని స్పష్టం చేశారు. నిర్ణీత ధరలను ఉల్లంఘించి అధిక ధరలకు బియ్యం విక్రయించినట్లు గుర్తిస్తే సంబంధిత చట్టాలు, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.