ఘనంగా ముగిసిన సౌత్ జోన్ స్పోర్ట్స్ మీట్
కరీంనగర్,(విజయక్రాంతి): బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్(Birla Open Minds International School), కరీంనగర్(Karimnagar ) ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన సౌత్ జోన్ స్పోర్ట్స్ మీట్ – 2026(South Zone Sports Meet 2026) ఆదివారం ఘనంగా ముగిసింది. ఐదు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 13 బ్రాంచ్ల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకున్నారు. వివిధ క్రీడా విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కరీంనగర్ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఓవరాల్ ఛాంపియన్గా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.
నవంబర్ 13న ప్రారంభమైన ఈ క్రీడా పోటీలు 15వ తేదీ వరకు కొనసాగాయి. ఆర్చరీ, చెస్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్, స్కేటింగ్, ఫుట్బాల్, క్రికెట్, తైక్వాండో, స్విమ్మింగ్ తదితర 13 క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని క్రమశిక్షణ, పట్టుదల, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు.
ముగింపు వేడుకలో పాఠశాల డైరెక్టర్ దాసరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే నైపుణ్యాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.
అనంతరం వివిధ క్రీడా విభాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పతకాలు, ట్రోఫీలు అందజేశారు. అత్యధిక విజయాలు సాధించిన కరీంనగర్ పాఠశాలకు ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీని ప్రదానం చేశారు. విద్యార్థుల విజయానికి కోచ్ల శిక్షణ, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, యాజమాన్య సహకారం దోహదపడ్డాయని నిర్వాహకులు తెలిపారు.
ముగింపు వేడుకల్లో విద్యార్థుల నృత్య, సంగీత, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమ విజయానికి సహకరించిన అన్ని బ్రాంచ్ల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, కోచ్లు, రిఫరీలు, నిర్వాహకులు, వాలంటీర్లకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు వైద్య సహాయం అందించిన కేఐఏ ఆసుపత్రి సేవలను ప్రత్యేకంగా అభినందించింది. మూడు రోజులపాటు సాగిన ఈ క్రీడా వేడుక విద్యార్థుల్లో ప్రతిభతోపాటు స్నేహభావం, ఐక్యత, పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తూ విజయవంతంగా ముగిసింది.