మధ్యాహ్న భోజన పథకానికి సరిపోని నిధులు!
- నామమాత్రంగా విద్యార్థులకు భోజనం.. పోషకాహారంపై నీలినీడలు
- రోజుకు రెండు కూరలకు బదులు ఒకటే వడ్డింపు.. వారానికి మూడు గుడ్లకు బదులు ఒక్కటే
- కోడిగుడ్డు ధర రూ.7–8 ఉంటే ప్రభుత్వం చెల్లించేది రూ.6 మాత్రమే.. నష్టాలతో వంట చేయలేమంటున్న కార్మికులు
బోధన్, నవంబర్ 10 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం(Midday Meal Scheme) నిధుల కొరతతో నీరుగారుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకం అమలవుతున్నప్పటికీ, ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు సరిపోక విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు రోజూ రెండు రకాల కూరలు అందించాల్సి ఉండగా, నిధుల కొరత కారణంగా చాలా పాఠశాలల్లో ఒకే రకమైన కూరతో సరిపెడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో విద్యార్థులకు అందాల్సిన పౌష్టికాహారం పూర్తిస్థాయిలో అందడం లేదని అంటున్నారు.
వారానికి మూడు గుడ్లకు బదులు ఒక్కటే!
విద్యార్థులకు వారానికి మూడు సార్లు కోడిగుడ్లు అందించాల్సి ఉండగా, కొన్ని పాఠశాలల్లో వారానికి ఒక్కసారి మాత్రమే గుడ్డు పెడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. మార్కెట్లో ఒక్క కోడిగుడ్డు ధర రూ.7 నుంచి రూ.8 వరకు ఉండగా, ప్రభుత్వం మాత్రం రూ.6 మాత్రమే చెల్లిస్తోందని వంట కార్మికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే ధరకు గుడ్లు కొనుగోలు చేసి వారానికి మూడుసార్లు అందిస్తే తమకు ఆర్థికంగా నష్టం వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిధులు పెంచాలని డిమాండ్
మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలంటే ప్రస్తుత ధరలకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు పెంచాలని విద్యార్థుల తల్లిదండ్రులు, వంట కార్మికులు కోరుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు కోడిగుడ్ల ధరను మార్కెట్ ధరలకు అనుగుణంగా సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మధ్యాహ్న భోజన పథకంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.