ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్టు

07-10-2026 | 10:06pm

19 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

కరీంనగర్‌ క్రైం, అక్టోబర్ 07, (విజయక్రాంతి): కరీంనగరంలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాను కరీంనగర్‌ టూ టౌన్‌ పోలీసులు(Karimnagar Two-Town Police) అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 19 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ టూ టౌన్  పోలీసులు అక్టోబర్‌ 7న పద్మనగర్‌ చౌరస్తా వద్ద  వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నుస్తులాపూర్‌కు చెందిన పింగళి విజేందర్‌రెడ్డి (33), కాదరి స్వామి (27)లను అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో గత కొంతకాలంగా కరీంనగర్‌, ఎల్ఎండీ, వేములవాడ తదితర ప్రాంతాల్లో తాళాలు పగలగొట్టి ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్నట్లు గుర్తించారు.  పోలీసుల విచారణలో విజేందర్‌రెడ్డి సుమారు 39 ద్విచక్ర వాహనాలను చోరీ చేసి వాటిని స్వామికి విక్రయించినట్లు తేలింది. స్వామి వాటిలో కొన్నింటిని విక్రయించడంతో పాటు మరికొన్నింటిని ఇతరులకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు విజేందర్‌రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు అతని వద్ద ఉన్న 11 ద్విచక్ర వాహనాలను, కాదరి స్వామి వద్ద ఉన్న 5 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అలాగే వాహనాలు కొనుగోలు చేసిన షేక్‌ ముబీన్‌ హుస్సేన్‌ (33), సయ్యద్‌ అబ్దుల్‌ హమీద్‌ (38) వద్ద నుంచి మరో 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.  ప్రాథమిక దర్యాప్తులో నిందితులకు కరీంనగర్‌టూటౌన్‌, కరీంనగర్‌వన్ టౌన్‌, కరీంనగర్‌త్రీ టౌన్‌, ఎల్ఎండీ, వేములవాడ టౌన్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నమోదైన పలు ద్విచక్ర వాహనాల చోరీ కేసులతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. చోరీ కేసులను ఛేదించి నిందితులను అరెస్ట్‌ చేయడంతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్న కరీంనగర్‌టూ టౌన్‌ పోలీసు బృందాన్ని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌస్ ఆలం అభినందించారు.

మరిన్ని వార్తలు