కల్లాల కాడికి రాకుండా కుట్ర
- మిల్లర్లు, వ్యాపారులు, దళారుల సిండికేట్
- ఉమ్మడి జిల్లాలో దళారులదే రాజ్యం
కరీంనగర్, నవంబరు 1 (విజయ క్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మిల్లర్లు(Millers), లైసెన్సు కలిగిన వ్యాపారులు, దళారులు సిండికేట్(Syndicate) గా ఏర్పడి రైతులను నిలువునా దగా చేసేందుకు సిద్ధమయ్యారు. వారి ఆగడాలను అడ్డుకుని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.
ఈ ఏడాది ఖరీఫ్‌లో అనుకున్న మేర వరిసాగు జరగలేదు. ఆయా జిల్లాల్లో ఇప్పటివరకు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల కలెక్టర్లు అధికారులతో సమావేశాలు నిర్వహించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎక్కడా కేంద్రాలు ప్రారంభం కాలేదు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో మొత్తం 20.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యపు దిగుబడి రానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల గతేడాదితో (22.76 లక్షల మెట్రిక్ టన్నులు) పోల్చితే సాగు విస్తీర్ణం దిగుబడి కొంత తగ్గినప్పటికీ, రైతులు పండించిన సన్న వరి రకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ లభిస్తోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా సాగు విస్తీర్ణం 9,31,506 ఎకరాలు కాగా, వరి సాగు విస్తీర్ణం 7,25,018 ఎకరాలు. దిగుబడి 20.55 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా వేశారు. అయితే మిల్లర్లు ఎల్‌నినో ప్రభావం ను ఆసరా చేసుకుని లూటీకి ప్రణాళిక రచించారు.-
దళారుల కనుసన్నల్లోనే ధరల నిర్ణయం
పంట చేతికి వచ్చే పదిహేను రోజుల ముందే ఉమ్మడి జిల్లాలోని మిల్లర్లు, వ్యాపారులు, దళారులు కొందరు రహస్య ప్రదేశాల్లో సమావేశమై సిండికేట్ గా ఏర్పడ్డారు. తొలుత సిరిసిల్లలో ఆ తరువాత కరీంనగర్ లో సమావేశమైనారు. రేటు కూడా వారే స్వయంగా నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయాలని అంతా ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఇదే తంతు కొనసాగుతోంది. సన్న వడ్లు క్వింటాలుకు 2500, దొడ్డు వడ్లు క్వింటాలుకు 2000 రూపాయలు మాత్రమే ధర నిర్ణయించి, కేవలం దళారులు మాత్రమే కొనుగోలు చేయడానికి వస్తున్నారు. అందులోనూ 70 కిలోల సంచికి తరుగు పేరుతో అదనంగా రెండు కిలోలు తీసివేస్తున్నారు.
ఈ విధంగా కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు కూడా వెంటనే చెల్లించకుండా 15 రోజుల నుంచి నెల రోజుల వరకు వాయిదా వేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పనిచేశామని, ఈ రేటు తమకు గిట్టుబాటు కాదని రైతులు మొత్తుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.-
కొర్రీలతో కోత..
ఈ రేటుకు ధాన్యం విక్రయించడం కూడా పూర్తిగా దళారుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉంది. దీనికి తోడు ‘ధాన్యం ఆరలేదు, తాలు ఎక్కువగా ఉంది‘ అంటూ రకరకాల కొర్రీలు పెడుతూ ధరను మరింతగా తగ్గించేందుకు పథకం వేశారు.
ఇప్పటికైనా ఉమ్మడి కరీంనగర్ జిల్లా యంత్రాంగం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, దళారుల అక్రమ దందాకు చెక్ పెట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా సన్న రకం వడ్లను మిల్లర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేసేలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.